సూర్యాపేట: మీడియా ముసుగులో కొంతమంది స్లాటర్ హౌస్‌లు నడుపుతున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి (Jagadish Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్ వ్యక్తిత్వాలను హననం చేసే దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. మీడియా ముసుగులో దాడి చేస్తే కేసీఆర్ అభిమానులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. మీ దాడులకు తాము ప్రతి దాడులు చేస్తే తట్టుకోలేరని చెప్పారు. సూర్యాటపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మీడియా ముసుగులో ప్రభుత్వం కేసీఆర్, కేటీఆర్‌లపై అసత్య ప్రచారాలు చేస్తున్నదని కాంగ్రెస్ పైమండిపడ్డారు. ఏడాదిన్నరగా మీడియాని అడ్డం పెట్టుకుని కేసీఆర్‌పై కుట్రలు చేస్తూన్నరని చెప్పారు. తమను ఇబ్బందిపెట్టే వారిని ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదని, చంద్రబాబు , రేవంత్‌ను చూసి మురుస్తున్న వారిని భవిష్యత్తులో ఎవ్వరూ కాపాడలేరని స్పష్టం చేశారు. పథకం ప్రకారమే బీఆర్ఎస్పై దుర్మార్గానికి పాల్పడుతున్నారని చెప్పారు. మీడియా కేంద్రాల ముసుగులో కబేళాలు (స్లాటర్ హౌస్‌లు) నడుపుతున్నారని మండిపడ్డారు. తెలంగాణాను ఆంధ్ర నుంచి విడదీశారనే అక్కసుతోనే కేసీఆర్‌పై కుతంత్రాలు చేస్తున్నారని ఆరోపించారు. తమ పిటిషన్లపై ప్రేక్షక పాత్రపోషించే పోలీసులు.. తమపైనే తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు.
‘రాజకీయ పార్టీలుగా మేమూ మేమూ తేల్చుకుంటాం. మీడియా అసత్య ప్రచారాలెందుకు. ప్రాణాలకు తెగించి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ పైనా మీ ప్రేలాపనలు. ఉద్యమం నుంచి వచ్చినోళ్లం కేసులకు భయపడతామా. మహా న్యూస్‌పై దాడి చేశారని ముసలి కన్నీరు కారుస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్‌పై అక్కసుతో అదేపనిగా పెట్టుకొని దాడులు చేస్తున్నారు. నిన్న జరిగింది దాడి కాదు.. నిరసన మాత్రమే. మా సహనానికి పరీక్ష పెట్టొద్దు. మీడియా ముసుగులో మీ ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు. బిన్ లాడెన్ లాగా ఎక్కడ దాక్కున్నా పట్టుకొని మీపని చెప్తాం. సంవత్సర కాలంగా మీ చెంచా గాళ్లు ప్రభుత్వాన్ని పాలిస్తున్నారు. వాళ్లను అడ్డం పెట్టుకుని నడుపుతున్న స్లాటర్ హౌసులను వదిలిపెట్టం. మా దాడి వేరే విధంగా ఉంటది. కేసీఆర్‌ది మొదటినుంచి గొప్ప క్షమాగుణం. ఆయన క్షమించినా మేము క్షమించం. భేషరతుగా మహా న్యూస్ యాజమాన్యం కేసీఆర్, కేటీఆర్‌కు క్షమాపణ చెప్పాలి.
కాంగ్రెస్ ఏడాదిన్నర పాలన అన్ని రంగాల్లో విఫలమైంది. సాగునీళ్ల విషయంలో ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి అజ్ఞానులు. మంత్రులకు పాలన చేతకాక ప్రతిరోజు కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. సూర్యాపేట జిల్లాలో కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయి. వేసిన విత్తనాలు ఎండిపోతున్నాయి. రైతాంగం అప్పులపాలైతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పే మాటలు చూస్తే నీళ్లు తెచ్చే పరిస్థితి లేదు. ఏ రాష్ట్రం కూడా ఎన్డీఎస్ఏ అనుమతుల కోసం ఎదురు చూడదు. రాజకీయ డ్రామాలు ఆపి వెంటనే కన్నేపళ్లి పంపులు ఆన్ చేసి రైతులకు నీళ్లు అందించాలి. రైతులను గోస పెట్టి.. మేము మాత్రం సుఖపడుతామంటే ఊరుకోం. ఇకనైనా కేసీఆర్‌పై ఏడుపు ఆపి అభివృద్ధిపై దృష్టి పెడితే మంచిద’ని జగదీష్ రెడ్డి అన్నారు.