Jagadish Reddy | కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే తెలంగాణలో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన బీఆర్ఎస్ మాక్ అసెంబ్లీలో మాట్లాడిన ఆయన.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణకు నీటి విషయంలో అన్యాయం జరిగిందని, కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రంలోని సాగునీటి పరిస్థితులు గణనీయంగా మారాయని అన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి శ్రీశైలం నీటిని అక్రమంగా తరలించారని విమర్శించారు.
బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలో రెండు కోట్ల ఎకరాలను సాగులోకి తీసుకొచ్చిన ఘనత కేసీఆర్‌దేనని జగదీశ్‌రెడ్డి అన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను నింపామని, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీరు అందించిన ఘనత కూడా కేసీఆర్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి తొమ్మిది జిల్లాలకు నీరు అందిందని జగదీశ్‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ మినహా మిగిలిన ఉమ్మడి జిల్లాలకు కాళేశ్వరం నీళ్లు పారాయని పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లాల్లో కాళేశ్వరం నీళ్లు పొంగిపొర్లాయని చెప్పారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యకు కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణమని జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్లోరైడ్‌ను తరిమికొట్టామని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కాలువల నిర్వహణపైనా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. కేసీఆర్ హయాంలో ఎడమ కాలువ గేట్లను తెరిచిన తర్వాత కుడి కాలువ గేట్లు తెరిచేవారని.. ప్రస్తుతం కుడి కాలువ గేట్లు తెరిచిన తర్వాత ఎడమ కాలువ గేట్లు తెరుస్తున్నారని అన్నారు.
పోతిరెడ్డిపాడు నుంచి వెలుగొండ ద్వారా ఆంధ్రప్రదేశ్ అక్రమంగా నీటిని తరలించుకుపోతోందని జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. కన్నెపల్లి నుంచి వేల క్యూసెక్కుల నీరు సముద్రంలో కలిసిందని, ఇప్పటికే 150 టీఎంసీల నీరు సముద్రంలో కలిసిందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని జగదీశ్‌రెడ్డి విమర్శించారు. కాగా, ఈ మాక్ అసెంబ్లీలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రి పాత్ర పోషించారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు శాసన సభ స్పీకర్‌గా వ్యవహరించారు. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ సభ్యులు సభలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు.