బొడ్రాయిబజార్, సెప్టెంబర్ 29 : హైడ్రా తరహాలో సూర్యాపేటలోనూ కూల్చివేతలు చేపడతామంటే ఊరుకునేది లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సద్దుల చెరువు ప్రాంతాల్లో అధికారులు సర్వే నిర్వహిస్తుండటంతో భయాందోళనలకు గురైన వందలాది కుటుంబాల వారు ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి రాగా ఆయన వారికి అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని పదేండ్లు కంటికి రెప్పలా కాపాడుకొని కేసీఆర్ అభివృద్ధి చేస్తే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు ఇచ్చిన బాధ్యతలు, హామీలు మరిచి అరాచకం సృష్టిస్తున్నదని మండిపడ్డారు. ఎవరూ భయాందోళనలు చెందవద్దని, అవసరమైతే కొట్లాడుదామని పిలుపునిచ్చారు. ప్రజల జీవితాలతో ఆడుకుంటామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రజల పక్షాన పోరాడేది బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టంచేశారు.
అధికారం ఇచ్చింది దోచుకోవడానికే అనుకొని ముఖ్యమంత్రి, మంత్రులు సోయి లేకుండా, బాధ్యత మరిచి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఇకపై ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఇండ్లు కట్టకుండా చూడాలని మాజీ సీఎం కేసీఆర్ చెప్పినట్టు ఆయన పేర్కొన్నారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. కేసీఆరే కూలగొట్టాలని నాడు చెప్పాడని మాయమాటలు చెప్తున్నాడని విమర్శించారు. కేసీఆర్ చెప్పిండని రైతు రుణమాఫీ, 4 వేల పెన్షన్, మహిళలకు రూ.2,500 వెంటనే ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రజలకు అండగా ఉంటే, సీఎం రేవంత్‌రెడ్డి వారి జీవితాలతో ఆడుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. అభివృద్ధి, సంక్షేమం మరిచిన కాంగ్రెస్ అరాచకాలు చేస్తుంటే ప్రజల్లో తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.