హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తేతెలంగాణ): ‘ఎల్కతుర్తి సభలో కేసీఆర్ చెప్పిన ప్రతి మాట అక్షరసత్యం. ఆయన ఎవరినీ దూషించలేదు. ఏ ఒక్కరి పేరు ఎత్తలేదు. కానీ కాంగ్రెస్ నాయకులు మాత్రం సభకు తరలివచ్చిన జనాన్ని చూసి బెంబేలెత్తుతున్నరు. సభ విజయవంతమైందనే అక్కసుతో కేసీఆర్‌పై ఎగిరెగిరి పడుతున్నరు’ అని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. కరెంటు, నీళ్లు, ధాన్యం కొనుగోలు, రుణమాఫీ, రైతుభరోసా, ఉద్యోగాల కల్పనలో విఫలమైన ప్రభుత్వ పెద్దలు ప్రజలను తప్పుదోవపట్టించేందుకే అడ్డగోలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. 16 నెలల కాంగ్రెస్ పాలనలో మళ్లీ సమైక్య రాష్ట్రంలోని పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దుర్మార్గపు పాలనతో 90 మంది గురుకుల పిల్లలను బలితీసుకున్నారని ధ్వజమెత్తారు. మంగళవారం తెలంగాణ భవన్లో మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, గాదరి కిషోర్, భాస్కర్‌రావు, రవీంద్రకుమార్, కంచర్ల భూపాల్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఎండను సైతం లెక్కచేయకుండా తండోపతండాలుగా తరలివచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సభను చూసి దిమ్మదిరిగిన ముఖ్యమంత్రి, మంత్రులు కేసీఆర్‌పై దుమ్మెత్తిపోస్తున్నారని విమర్శించారు.
నాటి నుంచి కాంగ్రెస్‌ది విలన్పాత్రే
తెలంగాణను ఆంధ్రాలో కలిపి ద్రోహం చేసినప్పటి నుంచీ ఇప్పటి వరకు కాంగ్రెస్‌ది విలన్ పాత్రనేని జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. ‘1969లో తెలంగాణ ఇవ్వాలని అడిగిన పాపానికి 400 మంది యువకులను నక్సల్స్ ముసుగులో కాల్చిచంపింది కాంగ్రెస్ కాదా? మలిదశ పోరాటంలో వందలాది మంది బిడ్డలను బలిపీఠమెక్కించింది ఎవరు? ఇప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తప్పించుకుంటున్నదెవరు? యూనివర్సిటీ భూములను అమ్మకానికి పెట్టిన దుర్మార్గులెవరు?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
దొంగ లెక్కలు కాదు.. ధాన్యం లెక్క చెప్పు?
అటు కాళేశ్వరం, ఇటు కృష్ణా జలాల వినియోగంపై దొంగలెక్కలు చెప్తున్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ సీజన్లో ఎంత ధాన్యం పండింది? ఎన్ని క్వింటాళ్ల వడ్లు కొన్నారు? ఎన్నివేల మంది రైతులకు బోనస్ ఇచ్చారో? చెప్పాలని జగదీశ్‌రెడ్డి సూ టిగా ప్రశ్నించారు. ఏడాదిన్నరలో ఏనాడూ సాగు పై సమీక్ష చేయని ఆయన ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని విరుచుకుపడ్డారు. రుణమాఫీ విషయంలోనూ తప్పుడు లెక్కలు చెప్పి తప్పుదోవపట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చేతగాకే కాళేశ్వరంపై నాటకం
కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతు చేతగాకే కాంగ్రెస్ సర్కారు ఎన్డీఎస్ఏ ముసుగులో నాటకానికి తెరలేపిందని జగదీశ్‌రెడ్డి దుయ్యబట్టారు. మూడు నెలల్లో పూర్తిచేయాల్సిన పనులను ఏడాదిన్నరైనా పూర్తి చేయడంలేదని విమర్శించారు. తమకు అప్పగిస్తే మూడు నెలల్లోనే అన్ని మోటర్లను నడిపించి ఉత్తమ్ నియోజకవర్గానికి కూడా నీరందిస్తామని సవాల్ విసిరారు. కృష్ణా జలాల వినియోగంలో రేవంత్ సర్కారు అసమర్థతను కేఆర్ఎంబీ బట్టబయలు చేసిందన్నారు.
పైసలు లేకుంటే ప్రజల కాళ్లు పట్టుకోవాలె
రాష్ట్రానికి రాబడి తగ్గిపోయిందని చెప్తున్న ముఖ్యమంత్రి తన జేబులు నింపుకోవడంలో బీజీగా ఉన్నారని జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. అధికారంలోకి రాగానే లంకెబిందెల కోసం వెదికిన ఆయన పాలన చేతగాక అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. నిజంగా ఇచ్చిన హామీల అమలు చేతగాకుంటే ప్రజల కాళ్లు పట్టుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
లక్ష్మణ్‌తో ఏనాడైనా మాట్లాడించారా?
ప్రజాస్వామ్యం గురించి బీజేపీ చెప్పడం విడ్డూరంగా ఉన్నదని జగదీశ్‌రెడ్డి ఎద్దేవా చేశారు. రజతోత్సవ సభలో కేసీఆర్ ఒక్కరే మాట్లాడం నియంతృత్వానికి నిదర్శమని ఆ పార్టీ నేత లక్ష్మణ్ అనడం హాస్యాస్పదంగా ఉన్నదన్నారు. ఏనాడైనా మోదీ సభలో ఆయన మాట్లాడారా? అని నిలదీశారు. బీజేపీ నాయకులు కాంగ్రెస్‌తో కుమ్మైక్కె బీఆర్ఎస్పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సమావేశంలో బీఆర్ఎస్ నేతలు మల్లికార్జున్‌రెడ్డి, కడారి స్వామియాదవ్ పాల్గొన్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో మావోల ఏరివేత పేరిట బీజేపీ సర్కారు హత్యాకాండను సాగిస్తున్నది. కేసీఆర్ మానవత్వంతోనే ఈ దుర్మార్గాలను నిలిపివేసి చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ మాట్లాడిన తర్వాతే ఈ అంశంపై అనేకమంది నాయకులు తమ వాణిని వినిపిస్తున్నారు.
-జగదీశ్‌రెడ్డి
కేసీఆర్ అసెంబ్లీకి పిల్లలను పంపించారని ఇష్టారీతిన మాట్లాడుతున్న సీఎం రేవంత్ వారి ప్రశ్నలకే సమాధానాలు చెప్పలేక నీళ్లు నలుముతున్నారు. ఇక, కేసీఆర్ వస్తే ఏం చెప్తారు. కాంగ్రెసోళ్లు చేతగానోళ్లనే వారి పాలనకు ఏడాదిన్నర సమయం ఇచ్చారు. కేసీఆర్ రావాల్సిన టైంలో కచ్చితంగా వస్తారు.
-జగదీశ్‌రెడ్డి
రాహుల్‌ను ఎవరూ గుర్తించడం లేదు.రాహుల్‌గాంధీ మొన్న హైదరాబాద్‌కు వచ్చి, ఏం మాట్లాడారో ఎవరికీ తెలియదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఆయనను పట్టించుకోలేదు. కానీ, కేసీఆర్ సభ పెడితే దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. దటీజ్ కేసీఆర్.
– జగదీశ్‌రెడ్డి