హైదరాబాద్, జూన్ 24(నమస్తే తెలంగాణ) : సోలార్ విద్యుత్ ఉత్పత్తి పథకం పీఎం కుసుమ్‌లో కాంగ్రెస్ పెద్దలు వెయ్యి కోట్ల స్కామ్‌కు తెరతీశారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జీ జగదీశ్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఎందరో గ్రామీణ యువకులు అప్పులు తెచ్చి వెయ్యి, 1,200 మెగావాట్ల ప్లాంట్లు నిర్మించుకొని రెండు, మూడు నెలలు దాటినా సింక్రనైజ్ చేసేందుకు నిరాకరించడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. సింక్రనైజ్ చేసేందుకు మెగావాట్‌కు రూ.10 లక్షలు ఇవ్వాలని ఇంధన, రెడ్కో కు చెందిన ఇద్దరు అధికారులు లంచం డిమాండ్ చేశారని ఆరోపించారు. కేంద్రం నిర్దేశించిన మేరకు యూనిట్‌కు రూ.3.13 కాకుండా కేవలం రూ.2.90 మాత్రమే ఇస్తామని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. సర్కార్ పెద్దల మాటలు నమ్మి ప్లాంట్లు పెట్టిన యువకులు మోసపోయారని ఆవేదన వ్యక్తంచేశారు.
కుసుమ్ స్కీమ్ కింద మహిళలను కోటీశ్వరులు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గప్పాలు కొట్టడం తప్ప చేసిందేమీలేదని దెప్పిపొడిచారు. కుసుమ్ స్కామ్‌పై ఆయన స్పందించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆయనకు కూడా పాత్ర ఉన్నదని భావించాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. కాంగ్రెస్ పాలనలో స్కీముల అమలు లేదని, కానీ రోజుకో కొత్త స్కామ్ వెలుగుచూస్తున్నదని ఎద్దేవా చేశారు. బుధవారం తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమార్, నల్లమోతు భాస్కర్‌రావు, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి గాదరి బాలమల్లు, పార్టీ నేతల చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, కురువ విజయ్‌కుమార్, పడాల సతీశ్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. బాధ్యులపై చర్యలు తీసుకోకుంటే కుసుమ్ స్కీమ్‌లో అక్రమాలకు పాల్పడుతున్న అధికారుల పేర్లతో పాటు విద్యుత్ శాఖలో మరో స్కామ్‌ను త్వరలోనే బట్టబయలు చేస్తామని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.
ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ ఘోరంగా విఫలమైందని జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. వడ్ల కుప్పలు రోడ్లపై ఉండగానే 15రోజుల కిందటే కొనుగోలు పూర్తిచేశామని ప్రకటించుకోవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తంచేశారు. నిస్సిగ్గుగా 35లక్షల మంది రైతులకు రూ.35వేల కోట్లు చెల్లించామని ప్రకటించుకోవడం, పేపర్లలో ప్రకటనలు ఇచ్చుకున్నారని దెప్పిపొడిచారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి దమ్ముంటే తమతో వస్తే కొనకుండా మిగిలిన వడ్ల రాశులను చూపిస్తామని సవాల్ విసిరారు. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని మిగతా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా ద్వారా ప్రభుత్వం రూ.30వేల కోట్లు రైతులకు బాకీపడ్డదని చెప్పారు. రైతుభరోసాకు ఇచ్చిన నిధుల కంటే సభల నిర్వహణకే ఎక్కువ ఖర్చుచేస్తున్నారని ఎద్దేవా చేశారు. యాసంగి పంట పెట్టుబడి సాయం అందించకుండానే వానకాలం పంటకు ఇస్తామని చెప్పుకోవడం శోచనీయమని మండిపడ్డారు. అక్టోబర్‌లో నిర్వహించే పరిషత్ ఎన్నికల్లో లబ్ధి కోసం మరో కొత్త నాటకానికి తెరలేపిందని ఆరోపించారు. సర్కార్ తీరుతో విసిగిపోయిన రైతులు తిరగబడుతారు.. జాగ్రత్త అని హెచ్చరించారు.
మొన్నటిదాకా సవాళ్లు ప్రతి సవాళ్లూ.. లేఖలు.. ప్రతిలేఖలతో రసవత్తర నాటకాన్ని రక్తికట్టించిన సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఢిల్లీలో మాత్రం ఒక్కటయ్యారని జగదీశ్పెడ్డి దెప్పిపొడిచారు. గల్లీలో ఫైటింగ్ చేసి ఢిల్లీలో మాత్రం డ్యూయెట్ పాడుతున్నారని ఎద్దేవా చేశారు. కిషన్రెడ్డీ.. మీరు రేవంత్‌రెడ్డికి పీఏగా పనిచేస్తున్నారా? కేంద్ర మంత్రిని భయపెడితే మరో కేంద్రమంత్రిని కలిపించడం గతంలో ఎప్పుడైనా చూశామా? అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి పేరుకు కాంగ్రెస్‌లో ఉన్నా హైబ్రిడ్ సీఎం మనసంతా బీజేపీపైనే ఉన్నదనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. వీరిద్దరి డ్రామాతో బీజేపీ, హైబ్రిడ్ కాంగ్రెస్ ఒక్కటేననే విషయం దేశ రాజధాని సాక్షిగా బట్టబయలైందని స్పష్టంచేశారు.
బీఆర్ఎస్ పని అయిపోయిందని పీసీసీ చీఫ్ మహేశ్ పిచ్చిప్రేలాపనలు చేస్తున్నారని జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ పని అయిపోతే పొద్దునలేస్తే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావును ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నించారు. ‘మహేశ్‌కుమార్‌గౌడ్ బీఆర్ఎస్ గురించి కాదు.. ముందు నీ పదవి ఉంటుందో ఊడుతుందో చూసుకో.. మీ ముఖ్యమంత్రే నీపై కుట్రలు చేస్తున్నడు..’అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మాయమాటలు చెప్పడం, మోసం చేయడం హైబ్రిడ్ కాంగ్రెస్‌కు మొదటినుంచీ అలవాటేనని తూర్పారబట్టారు. తమ మోసపూరిత చర్యలకు ఒప్పుకోలేదని కాంగ్రెస్ పెద్ద ఓ జాతీయ బ్యాంకును బ్లాక్మెయిల్ చేయడం దుర్మార్గమని ఖండించారు.
మోదీ తన వెనుక ఉన్నారనే ధైర్యంతోనే బ్యాంకు అధికారులను బెదిరించారని ఆరోపించారు. ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు క్రాస్‌బ్రీడ్ అయిన రేవంత్‌రెడ్డి వారు చెప్పినట్టే నడుచుకుంటున్నారని చురకలంటించారు. జనసేన కార్యాలయం పేరిట ఆ పార్టీ అధినేత ఓ డ్రామా నడుపుతున్నారని విమర్శించారు. ‘తెలంగాణకు రావద్దని ఎవరన్నారు? గతంలో ఇక్కడ పోటీ చేయలేదా? మున్సిపల్ ఎన్నికల్లోనూ బరిలోకి దిగలేదా? ఇప్పుడు ఇంత రాద్ధాంతమెందుకు? అన్ని రాష్ర్టాల్లో ఆఫీసులు పెట్టుకున్నా మాకేం అభ్యంతరం లేదు’ అని ప్రశ్నలవర్షం కురిపించారు. మోదీ, చంద్రబాబు, రేవంత్‌రెడ్డి, జనసేనానీలందరూ ఒక్కతాను ముక్కలేనని.. వారిది మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామానే అని చమత్కరించారు. అందరూ ఒక్కటై వచ్చినా తెలంగాణ ప్రజలు మాత్రం బీఆర్ఎస్వైపే ఉంటారని విశ్వాసం వ్యక్తంచేశారు.