హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ) : మాట తప్పిన రేవంత్ సర్కార్‌పై పోరుబాటకు ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. వాగ్దానాలు నెరవేర్చాలని ఎన్నిసార్లు విన్నవించినా హామీ ఇచ్చుడు తప్ప అమలు చేయకపోవడంతో ఇక తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించారు. 200లకు పైగా సంఘాలతో కలిసి జేఏసీగా ఏర్పడిన ఉద్యోగులు ఉద్యమ కార్యాచరణ పోస్టర్‌ను గురువారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వచ్చే నెల 1న చేపట్టనున్న ధర్నాకు సంబంధించిన నోటీసును జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీకి అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ తమను రోడ్డు మీదకు తీసుకురావద్దని సర్కారుకు సూచించారు. రోడ్డు మీదకు తీసుకువస్తే ఆపేవారేవరు ఉండరనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. హైదరాబాద్‌లోని లలితాకళాతోరణంలో ‘ఓల్డ్ పెన్షన్ స్కీమ్ సాధన పోరు’తో సమరశంఖం పూరిస్తామని ప్రకటించారు.
రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర నిర్వహించాలని నిర్ణయించినట్టు చెప్పారు. అక్టోబర్ 12న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ‘చలో హైదరాబాద్’ పేరిట భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్నారు. తామేమీ గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, తాము దాచుకున్న డబ్బులనే అడుగుతున్నామని స్పష్టం చేశారు. రూ.700 కోట్ల విలువైన పది వేల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు పెండింగ్ బిల్లులు, డీఏలు చెల్లిస్తామని, హెల్త్‌కార్డులు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. ప్రభుత్వ వైఖరిపై ఉద్యోగులందరూ అసంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు రెండేళ్లయినా బెనిఫిట్స్ ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు పుల్గం దామోదర్‌రెడ్డి, ముజీబ్ హుస్సేనీ, సత్యనారాయణ, కస్తూరి వెంకటేశ్వర్లు, ముత్యాల సత్యనారాయణగౌడ్, కటకం రమేశ్ తదితరులు పాల్గొన్నారు.