TGSRTC | హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ కార్మికులు రణభేరి మోగించారు. యాజమాన్య నిర్లక్ష్య ధోరణిపై ప్రత్యేక కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలపై 40 అంశాలను ప్రభుత్వం ముందుంచాలని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నిర్ణయించింది. సర్కారు నిర్ణయం మేరకు కార్యాచరణ ఉంటుందని జేఏసీ నేతలు ప్రకటించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదని రగలిపోతున్న కార్మికులు పోరుబాటకే సిద్ధమయ్యారు. మహాలక్ష్మి పథకం ప్రారంభించినప్పటి నుంచి డ్రైవర్లు, కండక్టర్లపై పనిభారం పెరిగిందని కార్మికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నా రు.
ప్రభుత్వం నుంచి రావాల్సిన బాండ్ల బకాయిలు రూ.200 కోట్లు, 2 పీఆర్సీ బకాయిలు, డీఏలు ఇప్పటివరకు పరిష్కారం కాకపోవడం కార్మికుల్లో అసహ నం పెరిగిందని ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్ ఎన్నికలు నిర్వహించి, కార్మిక సంఘాలకు గుర్తింపు ఇస్తామనే మాటను పట్టించుకోకపోవడంపై ఆర్టీసీ జేఏసీ మండిపడుతున్నది. ఈ నేపథ్యంలో శనివారం ఆర్టీసీ జేఏసీ తరఫున 40 అంశాలతో కూడిన మెమోరాండాన్ని రవాణా మంత్రి, ఎండీ, రవాణాశాఖ కమిషనర్‌ను కలిసి వారి ముందు పెట్టనున్నట్టు జేఏసీ ప్రతినిధులు తెలిపారు. కార్మికుల సమస్యలను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని, లేనిపక్షంలో ప్రత్యక్ష కార్యాచరణను ప్రకటించనున్నట్టు వెల్లడించారు.
ఎన్నికలు నిర్వహించాలి: థామస్‌రెడ్డి, వెంకన్న
కార్మికుల సమస్యల పరిష్కారానికి తక్షణమే ఆర్టీసీ ట్రేడ్ యూనియన్ల ఎన్నికలు నిర్వహించాలని ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు థామస్‌రెడ్డి, వెంకన్న ప్రభుత్వాన్ని డిమాం డ్ చేశారు. వెల్ఫేర్ బోర్డు వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, గుర్తింపు సంఘాల ఎన్నికలు నిర్వహిస్తేనే కార్మికులకు న్యా యం జరుగుతుందని వారు తేల్చి చెప్పా రు. ఎంటీడబ్ల్యూ యాక్ట్ ప్రకారం 8 గంట లు మాత్రమే డ్రైవర్లు, కండక్టర్లు పనిచేయాల్సి ఉండగా, ప్రస్తుతం 11 గంటలు, డబుల్ డ్యూటీలు చేయిస్తున్నారని తెలిపారు.