హైదరాబాద్, సిటీబ్యూరో, చిక్కడపల్లి, జులై 7 (నమస్తే తెలంగాణ): కార్మికుల హక్కులు కాలరాస్తూ పనివేళలను పది గంటలకు పెంచడాన్ని నిరసిస్తూ సోమవారం ఆర్టీసీ క్రాస్ రోడ్డులో తెలంగాణ కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల జేఏసీ నాయకులు జీవో 282 ప్రతులను దహనం చేశారు. ఏఐటీయూసీ, సీఐటీయూ, బీఆర్టీయూ, హెచ్ఎంఎస్, టీయూసీఐ, ఐఎఫ్టీయూ, టీఎన్టీయూ, ఏఐటీయూసీ సంఘాల నాయకులు సీఎం రేవంత్రెడ్డి నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా బీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అత్తినమోని నగేశ్కుమార్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి పాలనలో తెలంగాణ ఆగమవుతుందని విమర్శించారు. కార్మికులను నట్టేట ముంచడానికి జీవో 282 తీసుకొచ్చారని మండిపడ్డారు. అధికారంలోకి రాకముందర ఒక మాట.. వచ్చాక మరో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. కార్పొరేట్ ఇండస్ట్రీలకు అనుకూలంగా రేవంత్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బాలరాజ్, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, హెచ్ఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి రెబ్బా రామారావు, టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షుడు కే సూర్యం, ఐఎన్టీయూ రాష్ట్ర కార్యదర్శి అనురాధ, టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంకే బోస్, ఏఐటీయూసీ రాష్ట్ర ఇన్చార్జి భరత్ పాల్గొన్నారు.
పదిగంటల పని విధానం దుర్మార్గం ; ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): వాణిజ్య సంస్థల్లో ఉద్యోగులు, కార్మికులను రోజుకు పదిగంటలపాటు పని చేసేందుకు యాజమాన్యాలకు వీలు కల్పిస్తూ ప్రభుత్వం జీవో 282ను జారీ చేయడం దుర్మార్గమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు. సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. పనిగంటల మార్పు అనేది కార్మికులు పోరాడి సాధించుకున్న హకులకు భంగమని ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్కోడ్లను ఇలాంటి జీవోల ద్వారా దొడ్డిదారిన అమలు చేయడం మంచిది కాదని సూచించారు. ఈనెల 9న నాలుగు లేబర్కోడ్లను రద్దుచేయాలని సార్వత్రిక సమ్మెకు సిద్ధమైన తరుణంలో.. ఇలాంటి జీవో జారీచేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. ఈ 10గంటల విధానంలో యాజమాన్యాలకు పలు సూచనలు చేసినప్పటికీ.. ఆచరణకు సాధ్యం కాదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జీవో 282ను ఉపసంహరించుకోవాలని డిమాండ్చేశారు. సార్వత్రిక సమ్మెకు సీపీఐ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని కూనంనేని తెలిపారు.