శేరిలింగంపల్లి/సుల్తాన్‌బజార్, జూలై 16 : తమకు కేటాయించిన భూములను ప్రభుత్వమే ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే యత్నాలకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యోగులు కదం తొక్కారు. హైకోర్టు స్టేటస్కో విధించినప్పటికీ తమకు చెందాల్సిన ప్రభుత్వ భూముల్ని అన్యాక్రాంతం చేస్తున్న ‘బిగ్’ భూ దందాపై నిరసన గళం వినిపించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి బుధవారం ఉదయం వందలాదిగా తరలివచ్చిన ప్రభుత్వ ఉద్యోగులు, జేఏసీ నేతలు గోపన్‌పల్లి భూముల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. సర్వేనంబరు 36లోని 142.15 ఎకరాల లేఅవుట్లో టెంట్లు వేసి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు మాట్లాడుతూ.. భాగ్యనగర్ టీఎన్జీవో (గచ్చిబౌలి) హౌసింగ్ సొసైటీకి అన్ని ఉద్యోగ సంఘాలు అండగా నిలుస్తాయని.. అవసరమైతే 15 లక్షల మంది ఉద్యోగులు ఈ భూముల కోసం ఏ పోరాటానికైనా సిద్ధపడతారని స్పష్టంచేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చుట్టూ ఫెన్సింగ్ వేసుకున్న భూముల్లో ప్రైవేటు వ్యక్తులు యథేచ్ఛగా పనులు చేపట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు చెందిన భూములను ప్రైవేటు వారికి అప్పగిస్తే సహించేదిలేదని హెచ్చరించారు. ఇంచు భూమిని కూడా వదులుకోబోమని.. అవసరమైతే మరో ఉద్యమాని కి సిద్ధమని ప్రకటించారు. అనంతరం అక్కడే మధ్యాహ్నం భోజనాలు చేశారు.
ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో మాట్లాడినట్టు తెలిసింది. సమస్యను పరిష్కరించాలని కోరగా.. ఈ నెల 19 వరకు ఆగాల్సిందిగా మంత్రి సూచించినట్టు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. దీంతో తమ నిరసన కార్యక్రమాలను 19 వరకు కొనసాగించాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. సర్వేనంబరు 36లో వేసిన టెంట్ల కింద మూడురోజులు బైఠాయించాలని తీర్మానించాయి. ఉద్యోగులంతా ఆ స్థలంలోనే వంటావార్పు చేసుకుంటూ ప్రభుత్వం తమకు అనుకూలంగా నిర్ణయం తీసుకునేంతవరకు నిరసనను కొనసాగిస్తామని నాయకులు చెప్పారు. అంతకుముందు ఉదయం ఉద్యోగ సంఘాల నేతలు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డిని కలుసుకున్నారు. సదరు భూముల్లో ప్రైవేటు వ్యక్తులు భారీ యంత్రాలతో చేస్తున్న పనులను నిలిపివేయాలని కోరారు. కలెక్టర్ ఆదేశానుసారం ఉదయం పనులు నిలిచిపోయాయి. కానీ సాయంత్రం పనులు మళ్లీ మొదలయ్యాయి. దీనిపై అధికారులకు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదని, ఉద్యోగుల భూములపై తోటి ఉద్యోగులే పట్టింపులేకుండా వ్యవహరిస్తున్నారంటే వారిపై పైనుంచి ఎంత ఒత్తిడి ఉందో అర్థం చేసుకోవచ్చని వాపోయారు.
గోపన్‌పల్లి నుంచి ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్, తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ ఏలూరి శ్రీనివాసరావు, టీఎన్జీవో కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ఎం ముజీబ్ హుస్సేనీ, భాగ్యనగర్ తెలంగాణ ఎన్జీవోస్ (గచ్చిబౌలి) హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు ముత్యాల సత్యనారాయణగౌడ్ తదితరులు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డిని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా తమ వద్ద ఉన్న అన్నిరకాల డాక్యుమెంట్లు, అధికారిక లేఅవుట్, ఫీజు చెల్లింపులు, హైకోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు చూపించారు. ఆ తరువాత రాజేంద్రనగర్ ఆర్డీవో వెంకట్‌రెడ్డిని కూడా జేఏసీ నేతలు కలిశారు. అయితే కలెక్టర్‌తోపాటు ఇతర అధికారులంతా ‘పైకి’ చూపిస్తున్నారే తప్ప తమకు న్యాయం చేయడంలేదని జేఏసీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ భూములకు సంబంధించి ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిన ఎన్వోసీని చూపించాలని కోరగా.. కలెక్టర్ నారాయణరెడ్డి ఆర్డీవోను చూపిస్తారని… ఆర్డీవో వెంకట్‌రెడ్డి ఇస్తానంటారు తప్ప ఎన్వోసీ ఇవ్వడంలేదని జేఏసీ నేతలు ఆరోపించారు.
రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలం, గోపన్‌పల్లి గ్రామ పరిధిలోని సర్వేనంబరు 36, 37ల్లో ఏపీ ఎన్జీవోల ఇండ్ల స్థలాల కోసం 189.11 ఎకరాల భూమిని కేటాయించారు. 2010లోనే 142.15 ఎకరాల్లో అధికారికంగా లేఅవుట్ వేసి అన్నిరకాల ఫీజుల్ని కూడా ప్రభుత్వానికి చెల్లించారు. రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యోగులకు ఆ భూములను కేటాయించేందుకు తిరిగి స్వాధీనం చేసుకున్నది. ఈ క్రమంలోనే న్యాయపరమైన చిక్కులు తొలగించి, అధికారులతో సర్వే చేయించి, నివేదికలు తెప్పించుకొని ఉద్యోగులకు కేటాయించే క్రమంలో అసెంబ్లీ ఎన్నికలొచ్చాయి. అనంతరం వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇందులో 90 ఎకరాలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ‘నమస్తే తెలంగాణ’ ఈ గుట్టును రట్టు చేయడంతో ఉద్యోగులు అప్రమత్తమయ్యారు.
ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన భూమిని ప్రైవేట్ వ్యక్తులపరం చేస్తే ఊరుకునేది లేదు. న్యాయ పోరాటం చేసి ఆ భూమిని ఉద్యోగులకు ఇప్పిస్తాం. ఉద్యోగులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సర్వే నంబర్ 36లో 142.15 ఎకరాల స్థలంలో అధికారికంగా లేఅవుట్ చేసి ప్రభుత్వానికి రూ.18 కోట్ల ఫీజులు చెల్లించాం. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఎన్జీవో భాగ్యనగర్ తెలంగాణ ఎన్జీవోస్గా ఏర్పడి, టీఎన్జీవోకు అనుబంధంగా కొనసాగుతున్నది. గత ప్రభుత్వంలో పోరాటం చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని ఫెన్సింగ్ వేసుకున్నాం. ఈ భూముల్లో భాగ్యనగర్ టీఎన్జీవో సభ్యులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటికి విజ్ఞప్తి చేశాం. ఈ సొసైటీలో రిటైర్డ్ ఉద్యోగులు, చనిపోయిన ఉద్యోగులు, ఎంతోమంది ఉన్నారు. తక్షణమే సొసైటీకి ఇచ్చిన స్థలంలో వినాయక సొసైటీ అని ప్రైవేట్ వ్యక్తులు జరుపుతున్న పనుల్ని నిలిపివేయాలి. మా భూములు మాకొచ్చే వరకు పోరాటం చేస్తాం.
మేం తెచ్చుకున్న ప్రభుత్వంలో నే ఇంత అన్యాయమా? ప్రైవేట్ వ్యక్తులు బినామీ పేర్లతో దౌర్జన్యం చేస్తామంటే ఊరుకునేది లేదు. ప్రైవే టు వ్యక్తులు వాళ్ల దగ్గర ఉన్న పత్రాలేవో చూపించాలి. భాగ్యనగర్ తెలంగాణ ఎన్జీవోస్ వద్ద ఆ స్థలానికి సంబంధించిన పూర్తి పత్రాలు ఉన్నాయి. ఇంకా బెదిరించడానికి ప్రయత్నిస్తే సహించబోం. ఇప్పటికే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డిని సంప్రదించాం. ఎన్వోసీ పచ్చి అబద్ధం అని తేలింది.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించినట్టు ఉద్యోగుల స్థలాల సాధన కోసం మరో ఉద్యమానికైనా మేమంతా సిద్ధం. భాగ్యనగర్ సొసైటీకి ఇచ్చిన స్థలం ఎవరి అయ్య జాగీరు కాదు. బీటీ ఎన్జీవోలకు చెం దిన 142.15 ఎకరాలు సబ్ రిజిస్ర్టా ర్ కార్యాలయంలో మార్ట్గేజ్ అ యింది. రూపాయి రూపాయి కూడబెట్టుకొని ఎన్నో సంవత్సరాలుగా ఆశతో ఎదురుచూస్తున్న స్థలంలోకి వినాయక సొసైటీ పేరుతో ప్రైవేట్ వ్యక్తులు వస్తే చూస్తూ ఊరుకోబోం.
ఉద్యోగుల స్థలాలు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకోవడానికైనా సిద్ధ మే. మా స్థలం మాకే ఇవ్వాలని 20 ఏండ్లుగా వేచి చూస్తున్నాం. 20 22లో నాటి కలెక్టర్ నర్సింగ్‌రావు అనే పేరు ఎకడా లేదని నివేదిక ఇ చ్చారు. కానీ ఇప్పుడు వాళ్లకు ఎ న్వోసీలు ఇస్తున్నారు. మూడో వ్యక్తి కి (థర్డ్ పార్టీ) భూములను అప్పగించవద్దని హైకోర్టు స్టేటస్ కో ఉన్న ది. కానీ ఇప్పుడు నర్సింగరావు తమకు అమ్మాడంటూ కొందరు ప్రైవేటు వ్యక్తులు వచ్చి ఇక్కడ పనులు చేస్తున్నారు.