రాష్ట్రంలో ఉద్యోగుల పెండింగ్ సమస్యలను ఆగస్టు 15లోపు పరిష్కరించాలని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. అప్పటి వరకు వేచిచూస్తామని, ఆలోపు సమస్యలు పరిష్కరించకుంటే సమరానికి దిగుతామని హెచ్చరించింది. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రత్యక్ష ఆందోళనకు పూనుకుంటామని ప్రకటించింది.
హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): 18 నెలలుగా సమస్యల పరిష్కారం కోసం వేచిచూశామని, ఇంకా పెండింగ్‌లోనే ఉండటం శోచనీయమని ఉద్యోగ సంఘాల జేఏసీ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఎంప్లాయీస్ జేఏసీ సమావేశాన్ని శనివారం నాంపల్లిలోని టీఎన్జీవోభవన్లో నిర్వహించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ మాట్లాడుతూ తమ 57 డిమాండ్లలో ఎన్ని డిమాండ్లను సర్కారు పరిష్కరించిందో చెప్పాలని ప్రశ్నించారు.
‘ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. పీఆర్సీ గురించి మాట్లాడటం లేదు. రెండు డీఏలిస్తామన్నారు. ఇప్పుడొకటిచ్చి, ఆరునెలల్లో రెండోదిస్తాం. రెండో డీఏకు ఇప్పుడే జీవో ఇస్తామన్నారు. ఆఖరుకు ఒక డీఏతోనే సరిపెట్టారు. నెలకు రూ.700కోట్ల చొప్పున పెండిం గ్ బిల్లులు చెల్లిస్తామన్నారు. ఒక్క మెడికల్ బిల్లులు చెల్లించి, బిల్లుల విడుదలను విస్మరించారు’అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కిందిస్థాయిలో ఉద్యోగులు తమను నమ్మ డం లేదని జగదీశ్వర్ వాపోయారు. ‘చర్చల సందర్భంగా అన్ని డిమాండ్లపై సర్కారుతో ఒప్పుకుని వచ్చారు. పెండింగ్ బిల్లులింకా ఎందుకు క్లియర్ కావడంలేదని ఉద్యోగులు మాపై దాడిచేస్తున్నారు. ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితిలేదు. అన్నా.. క్యాన్సర్ వచ్చిం ది.. అన్నా స్టంట్ వేసుకున్నా నా పైసలిప్పిచండి అంటుంటే బాధగా ఉంది. చాలామంది టెన్షన్‌తో చనిపోయినవారున్నారు. మేం గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు. దాచుకున్న డబ్బులు మాకివ్వాలంటున్నాం. ఆఖరికి ఇన్సూరెన్స్ అయిన టీఎస్జీఎల్ఐ డబ్బులను సర్కారు వాడుకోవడం దారుణం. మీరు చెప్పింది మీరే అమలుచేయకపోతే ఎట్లా? మ్యానిఫెస్టోలో పెట్టినవే మేం అడుగుతున్నం. సీపీఎస్‌ను రద్దుచేస్తామని మ్యానిఫెస్టోలో పెట్టారు. ఒక్కరోజైనా దీని గురించి మాట్లాడారా?’ అని సర్కారును నిలదీశారు
ఉద్యోగుల సమస్యలపై జేఏసీ కార్యాచరణ ప్రకటించినా, ఉద్యమించేందుకు రోడ్డక్కినా ఆ నలుగురు అధికారులే కారణమని జేఏసీ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు ఆరోపించారు. ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌సుల్తానియా, ఉద్యోగుల సమస్యలపై నియమించిన త్రిసభ్య కమిటీ చైర్మన్ నవీన్‌మిట్టల్, ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తూ, పీఆర్సీ కమిటీ చైర్పర్సన్ శివశంకర్ ఇందుకు కారణమని పేర్కొన్నారు.
ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసే అవకాశమివ్వడంలేదని, ఈహెచ్ఎస్పై హెల్త్ సెక్రటరీ ఒక్కసారి కూడా సమావేశం ఏర్పాటు చేయలేదని, రెండు నెలలైనా ఉద్యోగులతో జరిపిన చర్చల మినిట్స్‌ను నవీన్ మిట్టల్ జేఏసీ నేతలకివ్వడంలేదని, పీఆర్సీ గడువు ముగిసినా ఇంకా నివేదికను సమర్పించడంలో కమిటీ చైర్పర్సన్ శివశంకర్ నిర్లక్ష్యం వహిస్తున్నారని ఏలూరి ఆరోపించారు. టీచర్ల ఏకీకృత సర్వీస్ రూల్స్‌ను రూపొందించాలని జేఏసీ అదనపు సెక్రటరీ జనరల్ దామోదర్‌రెడ్డి డిమాండ్ చేశారు. జేఏసీ నేతలు వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, సత్యనారాయణగౌడ్, మధుసూదన్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, సదానందంగౌడ్, రమేశ్, రాజభానుచంద్రప్రకాశ్, సంగి రమేశ్, మణిపాల్‌రెడ్డి, రాధాకృష్ణ, మల్లికార్జున్‌రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
కొందరు కలెక్టర్ల తీరుపైనా జగదీశ్వర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘కొందరు కలెక్టర్లు రాజకీయ నాయకులు కబంధ హస్తాల్లో చిక్కుకుని ఉద్యోగులను హింసిస్తున్నారు. బిల్లులివ్వకుండా, డబ్బులివ్వకుండా పనిచేయమంటే చిన్న ఉద్యోగులు ఎట్లా పనిచేస్తరు. హాస్టల్ వార్డెన్లకు బిల్లులివ్వకపోతే పిల్లలకు ఎట్లా తిండిపెడతారు. పంచాయతీ సెక్రటరీలకు ఏడాదిన్నర నుంచి నిధుల్వికపోతే వారు ఎట్లా పనిచేస్తరు. తప్పుచేస్తే శిక్షించండి. కానీ హింసించకండి’ అని కలెక్టర్లను కోరారు.