హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): ‘57 డిమాండ్లను సర్కారు ముందుంచాం. ముఖ్యమంత్రి, మంత్రులకు విన్నవించాం. ప్రిన్సిపల్ సెక్రటరీలను వందల సార్లు కలిశాం. 16 నెలల్లో మా డిమాండ్లపై ఏం చేశారు? సర్కారు స్పందనేమిటి? డిమాండ్లపై శాఖల నుంచి వివరాలు తెప్పించుకున్నారా? ప్రిన్సిపల్ సెక్రటరీలు నోట్స్ సిద్ధంచేశారా? ఇవేవీ లేకుండా చర్చలకు రండి.. వినతిపత్రాలివ్వండి.. ఫోజులు కొట్టండి.. ఫొటోలు దిగి వెళ్లిపోండి అంటే మాత్రం మేం చర్చలకు రాలేం. శాఖల నుంచి నోట్ లేకుండా చర్చలంటే మేం నమ్మాల్నా? చర్చల పేరుతో ఎవర్ని మోసం చేద్దామనుకుంటున్నారు? ఇదే విషయం కావాలంటే డిప్యూటీ సీఎంకి కూడా చెప్పండి’- ఇవీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేషీలోని ఒక ఉన్నతాధికారితో ఉద్యోగ సంఘాల జేఏసీ నేత ఫోన్లో చెప్పిన మాటలు.
కంగుతిన్న అధికారి
ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం చర్చలు జరపకపోవడం, తమ సమస్యలు పరిష్కారంకాకపోవడంతో మార్చి 12న ఉద్యోగ జేఏసీ ప్రత్యక్ష కార్యాచరణను ప్రకటించింది. ఇందులో భాగంగా పలు జిల్లాల్లో సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 12న చర్చలకు రావాలంటూ ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలను ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ సమావేశానికి ఎవరిని ఆహ్వానించాలో జాబితా కావాలంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేషీలోని ఉన్నతాధికారి ఒకరు ఉద్యోగ సంఘాల జేఏసీ నేతకు ఫోన్‌చేశారు. తీవ్ర ఆగ్రహానికి గురైన జేఏసీ నేత పేషీలోని ఉన్నతాధికారికి క్లాస్ పీకినంత పనిచేశారు. దీంతో కంగు తినడం సదరు ఉన్నతాధికారి వంతయ్యింది.
సమయమిస్తాం.. చర్చిస్తామంటేనే వస్తాం..
మంత్రివర్గ ఉపసంఘం చర్చల్లో ఒక్కో డిమాండ్‌పై చర్చిస్తామని, సమయం ఇస్తామంటేనే చర్చలకు వస్తామని జేఏసీ నేత స్పష్టంచేసినట్టు సమాచారం. ‘మేమిచ్చిన వాటిలో 45 ఆర్థికేతర అంశాలే. 12 మాత్రమే ఆర్థికపరమైనవి ఉన్నాయి. చర్చలకని పిలిచి ఫొటోలు దిగి వెళ్లిపొమ్మంటే కుదరదు. సమావేశానికి ముందే మేమిచ్చిన డిమాండ్లపై శాఖల వారీగా నోట్స్ తెప్పించుకోండి. మేమిచ్చిన డిమాండ్లను నెరవేరుస్తారా? లేదా? అన్నది అక్కడికక్కడే స్పష్టంచేయాలి. మేం హెల్త్‌కార్డులు ఇవ్వాలని మొత్తుకుంటుంటే, మళ్లీ హెల్త్ రీయింబర్స్మెంట్ పథకాన్ని పొడిగించారు. మేం అడిగింది ఏమిటి? మీరు చేస్తున్నది ఏమిటి?’ అంటూ సదరు ఉన్నతాధికారిని ప్రశ్నించినట్టు తెలిసింది.
పాత ప్రభుత్వమని ఎన్నాళ్లు తప్పించుకుంటారు?
‘సీఎం, డిప్యూటీ సీఎం అంతా సానుకూలంగా ఉన్నామంటారు.. మరి, ఇప్పటివరకు ఒక్క సమస్య అయినా పరిష్కారమైందా?’ అని జేఏసీ నేత సదరు అధికారిని నిలదీసినట్టు సమాచారం. ‘మమ్మల్ని దారుణంగా అవమానిస్తున్నారు. ముగ్గురు మంత్రులు మమల్ని లెక్కేచేయడంలేదు. ప్రిన్సిపల్ సెక్రటరీలైతే దారుణంగా వ్యవహరిస్తున్నారు. జిల్లా కలెక్టర్లు అసోసియేషన్ నేతల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు. 206 సంఘాలతో జేఏసీగా మేం ఏర్పడితే, రెండో జేఏసీని మీరే ప్రోత్సహిస్తున్నారు. అదర్ డ్యూటీ (ఓడీ)లు ఇష్టారాజ్యంగా ఇస్తున్నారు. ఓడీ ఇచ్చిన వారి సభ్యత్వమెంత? వారికి సభ్యులున్నారా?’ అంటూ తన అసంతృప్తినంతా వెళ్లగక్కినట్టు తెలిసింది. ‘ఇంకా ఎంతకాలం పాత ప్రభుత్వమని తప్పించుకుంటారు? జీవో-317 పాత ప్రభుత్వమే తెచ్చింది. మీరు తప్పులు సరిదిద్దుతామన్నారు కదా! మీరు పెండింగ్ డీఏలు లేకుండా చేస్తామన్నారు కదా! పీఆర్సీ ఇవ్వాల్సింది మీరే కదా! మాకు పాత, కొత్తతో సంబంధం లేదు. పాత ప్రభుత్వం.. కొత్త ప్రభుత్వంతో మాకేం పని? ఉద్యోగుల సంక్షేమమే మా ఎజెండా. మా 57 డిమాండ్లపై ఏదో ఒకటి తేల్చుతామంటేనే చర్చలకు వస్తాం’ అంటూ జేఏసీ నేత స్పష్టంచేసినట్టు సమాచారం.
12న చర్చలు అనుమానమే
ఉద్యోగ సంఘాల జేఏసీ నేత సర్కారుపై ఆగ్రహించిన నేపథ్యంలో ఈ నెల 12న చర్చలు జరగడం అనుమానంగానే కనిపిస్తున్నది. పైగా సమావేశానికి ఆహ్వానించాల్సిన సంఘాల నేతల సమాచారాన్ని కూడా ఇవ్వకపోవడంతో అసలు చర్చలుంటాయా? లేదా? అన్న అనుమానాలొస్తున్నాయి. జేఏసీ నేత చెప్పిన విషయాలన్నింటినీ డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లి, మళ్లీ కబురు పంపుతామని పేషీలోని ఉన్నతాధికారి చెప్పడం కూడా ఇందుకు బలం చేకూరుస్తున్నది. అయితే, ఇదే విషయంపై మరో నేత మాట్లాడుతూ.. ఈ నెల 12న దాదాపు చర్చలు జరగకపోవచ్చునని, అదనంగా రెండు మూడు రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నదని చెప్పారు.
37 డిమాండ్లను నెరవేర్చండి : ఎంప్లాయిస్ జేఏసీ
హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన 37 డిమాండ్లను పరిష్కరించాలని తెలంగాణ ఉద్యోగ జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. జేఏసీ చైర్మన్ వీ లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ప్రభుత్వ సలహాదారు కే కేశవరావును కలిసి 37 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. త్వరగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ దవాఖానల్లో నగదు రహిత చికిత్స, మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు విడుదల చేయాలని, రూ.10లక్షల వరకు పెండింగ్ బిల్లులను గ్రీన్‌చానల్ ద్వారా విడుదల చేయాలని కోరారు.