చిక్కడపల్లి, ఏప్రిల్ 2: అడుగడుగునా పోలీసుల నిర్బంధం కొనసాగుతున్నది. నిరుద్యోగుల విలేకరుల సమావేశాన్ని భగ్నం చేశారు. మీటింగ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులను భారీగా మోహరించి, అభ్యర్థులు ఎవరు రాకుండా అడ్డుకున్నారు. సమావేశానికి మద్దతుగా నిలిచినవారిని అరెస్టు చేశారు. పోలీసుల నిర్బంధంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. కనీసం విలేకరుల సమావేశం కూడా ఏర్పాటు చేసుకోనివ్వరా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలపై నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు త్యాగరాయ గానసభ వద్ద భారీగా మోహరించారు. ఆ పరిసర ప్రాంతాలకు అభ్యర్థులు ఎవరు రాకుండా అడ్డుకున్నారు. నిరుద్యోగులకు మద్దతుగా వచ్చిన ఫ్యాకల్టీ అశోక్‌ను అరెస్టు చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
చిక్కడపల్లిలో మీడియాతో మాట్లాడుతున్న నిరుద్యోగ జేఏసీ నాయకుడు జనార్దన్‌ను కూడా అరెస్టు చేసి నాంపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అరెస్టుకు ముందు జనార్దన్ మీడియాతో మాట్లాడుతూ.. గ్రూప్-1 నిర్వహణలో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఒకే సెంటర్లో పరీక్ష రాసిన అభ్యర్థులకు 550కుపైగా మా ర్కులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. తెలుగు మీడియం అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే రివాల్యుయేషన్ చేపట్టాలని డిమాండ్ చేశారు.