కవాడిగూడ, నవంబర్ 11: బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో ఎస్సీ వర్గీకరణను అడ్డుకొని తీరుతామని మాల ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ జీ చెన్నయ్య స్పష్టంచేశారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతు పలికే బీజేపీని ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తామని అన్నారు. తెలంగాణలో మాదిగల కంటే మాలలు అన్ని రంగాల్లో వెనకబడి ఉన్నారని చెప్పారు. కొన్ని రాజకీయ పార్టీలు ఉమ్మడి ఏపీలోని లెక్కలను బూచిగా చూపి మాల, మాదిగలను విడగొట్టి రాజ్యాధికారం వైపు చూడకుండా వర్గీకరణ అస్ర్తాన్ని పదే పదే ప్రయోగిస్తున్నాయని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శనివారం ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ చెన్నయ్య మాట్లాడుతూ.. ఎస్సీవర్గీకరణ విషయంలో ప్రధాని మోదీ, బీజేపీ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తూ మాల, మాదిగల మధ్య చిచ్చుపెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. మాల సామాజికవర్గాన్ని అణచివేయాలనే ఉద్దేశంతో బీజేపీ మాలల మెడపై కత్తి పెట్టిందని, దీన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. జేఏసీ వర్కింగ్ చైర్మన్లు బూర్గుల వెంకటేశ్వర్లు, మన్నె శ్రీధర్‌రావు, జంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణను జనాభా దామాషా ప్రకారం విభజిస్తామని, అగ్రకుల నాయకులు పదేపదే అంటున్నారని, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు బైండ్ల శ్రీనివాస్, ఆనంద్‌రావు, కోటేశ్, రాజేశ్, భాగ్యమ్మ, స్వర్ణలత, మహేశ్, జీ నాగరాజు, మధుబాబు తదితరులు పాల్గొన్నారు.