హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) పరిరక్షణ, కార్మికుల డిమాండ్ల సాధనలో భాగంగా కార్మిక సంఘాలు ఉద్యమ కార్యాచరణను ఉధృతం చేస్తున్నాయి. అందులోభాగంగా గురువారం డిమాండ్స్‌డేగా పాటిస్తామని, 21న రిలే నిరాహార దీక్షలు చేపడతామని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ ఎం థామస్‌రెడ్డి, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్‌డబ్ల్యూఎఫ్) అధ్యక్షుడు వీరాంజనేయులు, ప్రధాన కార్యదర్శి వీఎస్ రావు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 21న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద సామూహిక నిరాహార దీక్షలు చేపట్టనున్నట్టు జేఏసీ నేతలు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ దీక్షల్లో ఆర్టీసీ మహిళా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
మహిళా ఉద్యోగులు సమరంలో ముందుంటేనే సమస్యల పరిష్కారం వేగవంతం అవుతుందని జేఏసీ అభిప్రాయపడింది. గురువారం నిర్వహించే డిమాండ్స్ డే కార్యక్రమంలో యూనియన్లకు అతీతంగా కార్మికులంతా భాగస్వాములు కావాలని ఎస్‌డబ్ల్యూఎఫ్ నేతలు కోరారు. డిమాండ్స్ బ్యాడ్జీలను ధరించి కార్మికులు విధులకు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. సర్కారు నిధులతో మూడువేల ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేయాలని, ప్రతినెలా సంస్థకు రూ.430 కోట్లు రీయింబర్స్ చేయాలని డిమాండ్ చేశారు. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్వీసులు, రూట్ సర్వే చేసి రన్నింగ్ టైం ఇవ్వాలని, ఖాళీలను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయాలని, టిమ్స్‌లో అవసరమైన మార్పులు చేయాలని కోరారు. మహాలక్ష్మి పథకం నేపథ్యంలో కార్మికులపై పెట్టిన కేసులన్నింటినీ సానుభూతితో పరిశీలించి ఎత్తేయాలని, కార్మికోద్యమంపై ఆంక్షలు ఎత్తివేసి, గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. పీఎఫ్, ఎస్బీటీ, ఎస్ఆర్బీఎస్ ట్రస్టులకు బోర్డు ఆఫ్ ట్రస్టీలను నియమించాలని, సీసీఎస్ ప్రతినిధుల కోసం ఎన్నికలు నిర్వహించేందుకు అనుమతించాలని కోరారు.