CM KCR | ఉమ్మడి రాష్ట్రంలో దేశంలో ఎక్కడాలేని విధంగా పారిశ్రామికవేత్తలు సైతం కరెంటు కోసం రోడ్ల మీదికి వచ్చి ధర్నాలు చేసిన పరిస్థితి.. నేడు స్వరాష్ట్రంలో కనీసం విద్యుత్తు కోతలు ఏ ప్రాంతానికి వెళ్లినా కనిపించవు. అన్ని రంగాలకు నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా జరిగేలా సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యల వల్లనే సాధ్యమైందని పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ ఏర్పడిన నాటినుంచే విద్యుత్తుకు అధిక ప్రాధాన్యమిచ్చిన ముఖ్యమంత్రి పటిష్ఠమైన కార్యాచరణతో సరఫరా నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారని అంటున్నారు. ఆ ఫలితంగానే గత తొమ్మిదేండ్లుగా రాష్ట్రంలో విద్యుత్తు కోతలు అనే మాట లేకుండా పరిశ్రమలు నడుస్తున్నాయని తెలిపారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి రాష్ట్రంలో వేసవి వచ్చిందంటే పవర్ హాలిడేలు ఇచ్చేవారని, ఇప్పుడు తమకు ఆ తిప్పలు లేవని ఆనందంగా చెబుతున్నారు పారిశ్రామికవేత్తలు. రాష్ట్రంలో కేవలం వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకే కాకుండా అన్ని వర్గాల వారికీ చాలినంత విద్యుత్తును అందించే స్థితికి రాష్ట్రం చేరుకుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఒక రాష్ట్రంలో సగటు విద్యుత్తు వినియోగం ఎంత ఎక్కువగా ఉంటే.. దేశ, విదేశాల నుంచి అంత ఎక్కువగా పెట్టుబడులు వస్తాయని, అందుకు తెలంగాణలో వచ్చి పడుతున్న చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమలే నిదర్శనమని ఇంజినీర్లు, పారిశ్రామికవేత్తలు పేర్కొంటున్నారు.
దేశంలో ఏకైక రాష్ట్రం తెలంగాణ
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న దృఢమైన నిర్ణయం వల్లనే ఈ రోజు దేశంలో 24 గంటల పాటు అన్ని రంగాలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్తు కోతలతో పారిశ్రామికవేత్తలు, రైతుల బాధలు వర్ణనాతీతంగా ఉండేవి. ముఖ్యంగా రైతులు తమ ఎండిన పంటలతో విద్యుత్తు కార్యాలయాలకు వచ్చేవారు. పారిశ్రామికవేత్తలు సైతం రోడ్ల మీద ధర్నాలు చేసిన పరిస్థితిని మేము స్వయంగా చూశాం. అలాంటిది నేడు దేశంలోనే అత్యంత పటిష్ఠమైన విద్యుత్తు సరఫరా వ్యవస్థ, ఉత్పత్తి కలిగిన రాష్ట్రంగా తెలంగాణను సీఎం కేసీఆర్ తీర్చిదిద్దారు. విద్యుత్తు సంస్థలో 32 ఏండ్ల పాటు వివిధ హోదాల్లో పనిచేశాను. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం విద్యుత్తు సమస్యకు ఎక్కువ ప్రాధాన్యమివ్వలేదు.
అందుబాటులో ఉన్న విద్యుత్తుతోనే సర్దుబాటు చేసుకొని వాడుకోండి అని చెప్పేవారు. అదనంగా విద్యుత్తును కొనలేని పరిస్థితి ఉండేది. కొనాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉండేది కాదు. దాంతో ఉన్న కరెంటునే నిర్ణీత గంటల పాటు ఆయా రంగాల వారీగా సరఫరా చేశాం. కానీ తెలంగాణ ఏర్పాటైన తర్వాత సీఎం కేసీఆర్ విద్యుత్తుకు అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. రాష్ట్రంలో విద్యుత్తు సమస్య లేకుండా ఉండడానికి ఎంతైనా ఖర్చు చేస్తాం. అందరికీ విద్యుత్తు సరఫరాను అందించాలని చెప్పి, దానికి అవసరమైన బడ్జెట్‌ను సైతం కేటాయించారు. అలా 1-1-2017 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 24 గంటల పాటు నిరంతరం నాణ్యమైన విద్యుత్తు సరఫరాకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ప్రస్తుత అవసరాలే కాకుండా భవిష్యత్తు అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని కొత్త ప్రాజెక్టులకు, సోలార్ విద్యుత్తు ఉత్పత్తికి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు.
నిరంతరం నాణ్యమైన విద్యుత్తు
Anil Agarwal
రాష్ట్రంలో పరిశ్రమలకు నిరంతరం కోతలు లేకుండా నాణ్యతతో కూడిన విద్యుత్తు సరఫరా అవుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు ఇప్పటికి చాలా తేడా ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లే ఈ రోజు పరిశ్రమలకు, ఇతర రంగాలకు సైతం విద్యుత్తు సంపూర్ణంగా 24 గంటలపాటు అందుతున్నది. పరిశ్రమ నిర్వాహకులు విద్యుత్తు సరఫరా పట్ల చాలా సంతృప్తికరంగా ఉన్నారు. సోలార్ విద్యుత్తు, పునరుత్పాదక ఇంధనం వంటి అంశాల్లో ప్రభుత్వం మరింత ఎక్కువ చొరవ తీసుకుంటే బాగుంటుందని పారిశ్రామికవేత్తలు కోరుకుంటున్నారు.
– అనిల్ అగర్వాల్, పారిశ్రామికవేత్త, ఎఫ్‌టీసీసీఐ పూర్వ అధ్యక్షుడు
2 వేల కోట్లతో మౌలిక వసతులు
Vidya Sagar Ex Cgm
కొత్తగా తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తు మన అవసరాలకు ఏమాత్రం సరిపోవడం లేదు. అదనంగా బయటి నుంచి కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను సమకూర్చింది. దీంతో సరిపడా విద్యుత్తు ఉన్నా, అందరికీ 24 గంటల పాటు సరఫరా చేసే నెట్వర్క్ లేదని విద్యుత్తు శాఖ ఉన్నతాధికారులు సీఎం దృష్టి తీసుకెళ్లారు. ఇందుకోసం ఏం చేయాల్సి ఉంటుంది? ఎంత ఖర్చవుతుందని సీఎం కేసీఆర్ అడిగితే.. తాము కొత్తగా సబ్ స్టేషన్లను పెంచాలని, లైన్లను వేయాలని సూచించాం. అంతే వెంటనే సీఎం కేసీఆర్ రూ.2వేల కోట్లు మౌలిక వసతుల కోసమే కేటాయించారు. అలా ఎంతో పట్టుదలతో విద్యుత్తు రంగంలో ఉన్న సమస్యలను సమూలంగా పరిష్కరించేలా సీఎం కేసీఆర్ ఆ రోజు గట్టి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టే నేడు రాష్ట్రంలో వేసవిలో కూడా విద్యుత్తు కోతలు లేవు. రాష్ర్టాభివృద్ధికి విద్యుత్తు ఎంత ముఖ్యమో గుర్తించి, దానికి అనుగుణంగా నిధుల గురించి లెక్క చేయకుండా వేల కోట్లను ప్రభుత్వం కేటాయించింది. విద్యుత్తు రంగంలో అనుభవజ్ఞులైన ఉన్నతాధికారులు సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతో రాష్ట్రంలో కరెంటు సమస్యకు చోటులేకుండా చేశారు. ఎంతో విజయవంతంగా రాష్ట్రంలో నిరంతరం నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేస్తున్నట్టు గుర్తించిన ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తెలంగాణకు వచ్చి అధ్యయనం చేస్తున్నాయి.
– విద్యాసాగర్, రిటైర్డ్ అధికారి (సీజీఎం), ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఎనర్జీ అండ్ పవర్ విభాగాధిపతి
సాఫ్ట్వేర్ సగం ఇన్స్టాల్ కాగానే కరెంటు పోయేది
నకిరేకల్‌లో 13 ఏండ్లుగా కంప్యూటర్ హార్డ్‌వేర్ షాపు నడుపుతున్నా. ఉదయం 9 నుంచి రాత్రి 9గంటల వరకు షాపులో వర్క్ చేస్తా. 2014కు ముందు కరెంటు 3 నుంచి 4 గంటలు మాత్రమే ఉండేది. అప్పట్లో కంప్యూటర్ వాడకం ఎక్కువగా ఉండటం వల్ల రిపేర్లు బాగా వచ్చేవి. సగం సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయగానే కరెంటు పోయేది. కరెంటు ఉన్న 2, 3 గంటల్లో కంప్యూటర్ బోర్డుగానీ, ప్రింటర్, స్కానర్ల రిపేర్లు సరిగా అయ్యేవి కావు. దీంతో కస్టమర్లు రిపేరుకు ఇచ్చి మూడు నాలుగు రోజుల తరువాత వచ్చేవారు. కరెంటు ఉంటే తొందరగా రిపేరు చేసి ఇచ్చేవాణ్ని. కరెంటు లేక షాపు నిర్వహణ కష్టమయ్యేది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 24 గంటల కరెంటు ఇస్తుండడంతో ఏ రోజు రిపేరు ఆ రోజే చేసి ఇస్తున్నా. ఆర్థికంగా నిలదొక్కుకున్నా. కాంగ్రెస్ నాయకులను గెలిపిస్తే మళ్లీ 3, 4 గంటల కరెంటు ఇస్తారేమో. అందుకే కేసీఆరే సీఎం కావాలి. ఆయన గెలుపులో భాగస్వామినవుతా.
– కిన్నెర గిరిబాబు, కంప్యూటర్ హార్డ్‌వేర్ షాపు నిర్వాహకుడు, నకిరేకల్