హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ఫ్రంట్‌లైన్ వర్కర్లకు జీతాలివ్వకపోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. తెలంగాణ వైద్యవిధాన పరిషత్ దవాఖానలల్లో శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బందికి 3 నెలలుగా జీతాలు చెల్లించకుండా వాళ్లు రోడ్డెక్కేలా చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దకిందని ఎద్దేవాచేశారు. జీతం రాకపోవడంతో పిల్లల చదువులు, ఇంటి కిరాయిలు చెల్లించలేక కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
టెండర్ ప్రకారం జీతాలు ఇవ్వకుండా, పీఎఫ్ డబ్బులు జమ చేయకుండా కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని, వర్కర్లకు అన్యాయం జరుగుతుంటే సర్కార్ ఏం చేస్తున్నదని నిలదీశారు. ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతనాలు ఇస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్న సీఎం రేవంత్‌రెడ్డికి చిరుద్యోగుల ఆవేదన కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఫంట్లైన్ వర్కర్లకు పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రతినెలా సకాలంలో వేతనాలివ్వాలని, జీతంలో కాంట్రాక్టర్లు కోత పెట్టకుండా నిలువరించాలని కోరారు.