CM Revanth Reddy | హైదరాబాద్, సెప్టెంబర్ 15(నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి చేసింది కాంగ్రెస్ పార్టీ వాళ్లేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుండబద్దలు కొట్టారు. ‘మన ఇంటికి వస్తమని చెప్పిండ్రు.. కానీ, మనొళ్లే వాళ్ల ఇంటికి పోయిండ్రు..ఒళ్లు చింతపండు చేసిండ్రు’ అని సీఎం వ్యాఖ్యానించారు. దీంతో కౌశిక్‌రెడ్డిపై దాడి చేసిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఏ పార్టీవారో సీఎం స్పష్టం చేసినట్టయ్యింది. ఈ వ్యాఖ్యల ద్వారా గాంధీ తమవాడేనని తేల్చి చెప్పేశారు. ఆదివారం గాంధీభవన్‌లో నిర్వహించిన పీసీసీ నూతన అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ బాధ్యతల స్వీకరణ సభలో ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కార్యకర్తలపై కేసులు పెట్టాలని దాడులకు ప్రయత్నిస్తున్నారు.
ఒళ్లు చింతపండు అయ్యాక.. మా ఇంటికి వచ్చి తన్నిండ్రు అని చెప్తున్నరు. సంకనాక పిలవాలా.. రా రా చూసుకుందాం అని..’ అంటూ అసలు విషయం చెప్పేశారు.ప్రతిపక్ష ఎమ్మెల్యేకు ఇవ్వాల్సిన పీఏసీ చైర్మన్ పదవిని ఫిరాయింపు ఎమ్మెల్యే గాంధీకి ఇవ్వడంపై బీఆర్ఎస్ మండిపడింది. దీంతో గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని, అందుకే పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చామని మంత్రులుశ్రీధర్బాబు, భట్టి విక్రమార్క చెప్తూ వచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలో గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని చెప్పారు. ఆదివారం మాత్రం ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కాంగ్రెస్ ఎమ్మెల్యేనని చెప్పకనే చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి తాజా వ్యాఖ్యలతో అబద్ధాల కుండ బద్దలైపోయింది. సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు ప్రతిపక్ష బీఆర్ఎస్పై దాడులను ప్రోత్సహించేలా ఉన్నాయనే విమర్శలొస్తున్నాయి. సీఎం రేవంత్ భాషపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా యి. ప్లాన్ ప్రకారమే కౌశిక్‌రెడ్డిపై దాడికి ఉసిగొల్పారనే ప్రచారం సాగుతున్నది.