Telangana Martyrs Memorial | హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): భారీస్థాయి కోడిగుడ్డు ఆకారం, అద్దంలా మెరిసిపోయే ఫినిషింగ్, పైభాగంలో ఎరుపు-పసుపు కలగలిసిన రంగులో మండుతున్న జ్వాల ఆకృతి… ఇదీ తెలంగాణ రాష్ట్రసాధనలో అమరులైనవారికి గుర్తుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రతిష్ఠాత్మక అమరవీరుల స్మారకచిహ్నం. హైదరాబాద్ నడిబొడ్డున.. ఓ వైపు హుస్సేన్‌సాగర్, మరోవైపు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయానికి మధ్యలో దీన్ని నిర్మించారు. ఈ నెల 22న ప్రారంభానికి సిద్ధమవుతున్న ఈ స్మారకానికి రూ.177.50 కోట్లు ఖర్చు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన, అతుకులు లేని స్టెయిన్లెస్ స్టీల్‌తో నిర్మితం కావటం దీని ప్రత్యేకత.
ఎన్నో విశేషాలు
3.29 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనం లోపల ఓ మ్యూజియంతోపాటు సుమారు 100మంది కూర్చునే సామర్థ్యం ఉన్న ఆడియో-విజువల్ హాలు, 650 మంది కూర్చునే విధంగా కన్వెన్షన్ సెంటర్, పర్యాటకుల కోసం ఓ రెస్టారెంట్‌తోపాటు ఇతర సౌకర్యాలు, 350 కార్లు, 600 బైకులకు సరిపడా పార్కింగ్ సౌకర్యం ఉన్నది. భవనం నిర్మాణ వైశాల్యం(బిల్టప్-ఏరియా) 2.88 లక్షల చదరపు అడుగులు. హుస్సేన్‌సాగర్ అందాలు, బుద్ధవిగ్రహం, బిర్లామందిర్, అంబేద్కర్ విగ్రహం, సచివాలయం తదితర నిర్మాణాలు వీక్షించేందుకు వీలుగా టెర్రస్‌పై రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. అమరుల స్మారకం నిర్మాణ పనులు దాదాపు పూర్తికాగా, ప్రస్తుతం ఫినిషింగ్ పనులు, ప్రధాన ద్వారం, గ్రీనరీ తదితర పనులు కొనసాగుతున్నాయి.
ఈ భవనం వెలుపల నిర్మాణం కోసం 3000 స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్లను ఉపయోగించారు. ఈ మొత్తం ప్లేట్ల బరువు సుమారు 100 టన్నులు. వీటిని దుబాయ్‌లో ఫ్యాబ్రికేట్ చేయించి ఇక్కడికి తరలించగా, సైట్‌పై వీటిని అత్యాధునిక టెక్నాలజీతో అతుకులు లేనివిధంగా అసెంబుల్ చేశారు. లోపలి గోడలు, స్లాబులకు మాత్రమే కాంక్రీట్‌ను ఉపయోగించారు. దీనికోసం సుమారు 1200 టన్నుల స్టీల్‌ను వినియోగించారు.
వేడిలేకుండా ప్రత్యేక డిజైన్
అమరులకు గౌరవ సూచికంగా కొవ్వొత్తులు, దీపాలు వెలిగించడం ప్రపంచవ్యాప్తంగా ఆనవాయితీ.. ఈ క్రమంలోనే వెలుగుతున్న దీపం ఆకృతిగల నిర్మాణాన్ని సీఎంకేసీఆర్ ఎంపికచేశారు. చుట్టూ స్టీలు వలయం ఉన్నప్పటికీ భవనం వేడెక్కకుండా ఉండేలా దీన్ని డిజైన్ చేశారు. పఫ్ మెటీరియల్, సపోర్టింగ్ జీఆర్సీ(ఫైబర్-రీయిన్‌ఫోర్స్ కాంక్రీట్) షీట్లు లోపల ఉష్ణోగ్రతను నియంత్రించటంలో సహాయపడతాయి.
ప్రపంచంలోనే అతిపెద్ద అతుకులులేని స్టెయిన్లెస్ నిర్మాణం
అమరుల స్మారకానికి సంబంధించి పాలిష్ చేయబడి ఉబ్బినట్లుగా ఉన్న బాహ్యభాగం పశ్చిమ చైనీస్ నగరమైన కరామేలోని ‘క్లౌడ్ గేట్’, చికాగోలోని ‘బీన్’ నిర్మాణాలను పోలి వుంటుంది. ఇది ప్రత్యేక రాష్ట్రసాధన ఉద్యమ అమరవీరులకు నివాళులర్పించే సంప్రదాయ మట్టి నూనె దీపాన్ని పోలి ఉండటం విశేషం. 161అడుగుల ఎత్తు, 158 అడుగుల వెడల్పుతో ఇది ‘క్లౌడ్ గేట్’ కంటే ఐదారు రెట్లు పెద్దది. ప్రపంచంలో ఇంత పెద్ద అతుకులు లేని స్టెయిన్లెస్ స్టీల్ నిర్మాణం మరెక్కడా లేదు.
మరో పర్యాటక ప్రాంతంగా..
హుస్సేన్‌సాగర్ తీరంలో నిర్మించిన 125 అడుగుల అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం పర్యాటకులను విశేషం గా ఆకర్షిస్తుండగా, అమరుల స్మృతి చి హ్నం మరో పర్యాటక కేంద్రంగా మారనున్నది. ఓ వైపు అత్యంత ఆకర్షణీయ సచివాలయం, మరోవైపు, ఆహ్లాదకర హుస్సేన్‌సాగర్ పరిసరాలు, బుద్ధుని విగ్రహం, లుంబినీ పార్క్, ట్యాంక్‌బండ్, నెక్లెస్రోడ్కుతోడు అమరుల స్మారక చిహ్నం హైదరాబాద్ నగరానికి మరింత వన్నె తెస్తుందనడంలో సందేహం లేదు.