అబద్ధం : నెల జీతం రాక గాంధీ దవాఖాన కాంట్రాక్టు ఉద్యోగిని జ్యోతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
నిజం : హైదరాబాద్‌కు చెందిన జ్యోతి గాంధీ దవాఖాన కాంట్రాక్టు ఉద్యోగిని. గురువారం ఉదయం తన ఇంట్లో వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు జ్యోతికి మంటలు అంటుకొన్నాయి. చికిత్స నిమిత్తం ఆమెను గాంధీ దవాఖానకు తరలించారు. జీతం అందకనే తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు సోషల్ మీడియాలో ప్రచారం కావడం పట్ల తాను మనోవేదనకు గురైనట్టు బాధితురాలు జ్యోతి తెలిపారు. ప్రమాదవశాత్తు ఒంటికి మంటలు అంటుకొన్నట్టు జ్యోతి స్పష్టంచేశారు. గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు ఘటనపై విచారణ చేపట్టగా..ప్రమాదానికి, జీతానికి సంబం ధం లేదని తేలింది. బాధితురాలికి ఎలాంటి జీతం బకాయిలేదని రాజారావు తెలిపారు.
తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు
నిరంతరం పేదలకు సేవలందించే గాంధీ వంటి ప్రభుత్వ దవాఖానలపై తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదని డాక్టర్ రాజారావు అన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఇలాంటి ప్రచారాలతో గాంధీ దవాఖాన ఇమేజ్‌తో పాటు సిబ్బంది మనోధైర్యం దెబ్బతింటుందన్నారు. తప్పుడు ప్రచారాలు చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకొనేందుకు వెనుకాడబోమని రాజారావు హెచ్చరించారు.
– సిటీబ్యూరో, జూన్ 2 (నమస్తే తెలంగాణ)