హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): ఈసారి తెలుగు రాష్ర్టాల్లో వర్షాల పరిస్థితి గందరగోళంగా మారిందని వాతావరణ కేంద్రం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. భారత వాతావరణశాఖ (ఐఎండీ) అంచనా ప్రకారం.. ఈనెల 17వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉండగా, పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయని వెల్లడించింది. తెలంగాణలో ఆదివారం మధ్యాహ్నం వరకు మేఘాలు కమ్ముకున్నా, వర్షపాతం కొన్ని చోట్లే కురిసే సూచనలు ఉన్నట్టు పేర్కొన్నది. ఏపీలోనూ ఆకాశం మేఘావృతంగా వాతావరణం కనిపించినా.. వర్షాలు పెద్దగా కురిసే సూచనలు లేవని తెలిపింది. రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 33నుంచి 34 డిగ్రీలుగా నమోదు అవుతున్నట్టు పేర్కొన్నది. తేమ పగటివేళ 63%, రాత్రివేళలో 75% ఉన్నట్టు వివరించింది. సాధారణంగా ఈ సమయంలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురవాల్సి ఉండగా, ఈసారి అంచనాలకు విరుద్ధంగా వర్షాలు పెద్దగా కురవడం లేదని వెల్లడించింది. కాగా, గడిచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిశాయని తెలిపింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో అత్యధికంగా 4.88 మి.మీ వర్షం పడినట్టు వెల్లడించింది.
ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద
అయిజ/మోర్తాడ్, జూన్ 15 : కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వానలకు జూరాల, తుంగభద్ర ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. ఆదివారం జూరాల ప్రాజెక్టుకు 20వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, అవుట్ ఫ్లో 21,677 క్యూసెక్కులు నమోదైంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 అడుగులు కాగా, ప్రస్తుతం 316.550 అడుగుల నీటిమట్టం ఉన్నది. తుంగభద్ర డ్యాంకు ఇన్‌ఫ్లో 8,585 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 178 క్యూసెక్కులు నమోదైంది. గరిష్ఠ నీటిమట్టం1633 అడుగులకుగాను ప్రస్తుతం 1603.82 అడుగుల నీటిమట్టం ఉంది. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఆదివారం 2,083 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చినట్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091అడుగులకు 1063.20 అడుగుల నీరు నిల్వ ఉన్నది.