
హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): రైతుల మేలు, సమాజ హితం కోసం ప్రముఖ దర్శకుడు ఆర్ నారాయణమూర్తి తెరకెక్కించిన రైతన్న సినిమాను ఆదరించాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి కోరారు. ప్రజలు, రైతు పక్షపాతి ఆర్ నారాయణమూర్తి అనేక కష్టనష్టాలకోర్చి ఈ సినిమాను నిర్మించినట్టు తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాసంలో నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ… రైతన్న సినిమాలో మట్టికి, మనిషికి గల సంబంధాన్ని అద్భుతంగా ఆవిష్కరించారని చెప్పారు. ప్రజా ప్రయోజనం కోరే సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయని, ఈ సినిమా ఆ కోవకే చెందుతుందని పేర్కొన్నారు. వ్యాపార విలువలే ప్రధానంగా ఉన్న ఈ పరిస్థితుల్లో ప్రజలు, రైతుల కోసం సినిమాలు తీయడం ప్రశంసనీయమని, శనివారం విడుదలవుతున్న రైతన్న సినిమాను ప్రతి ఒక్కరు ఆదరించాలని కోరారు. ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు రైతులపాలిట శాపాలని పేర్కొన్నారు. ఇలాంటి చట్టాలు దేశానికి పనికిరావని స్పష్టంచేశారు. కొత్త చట్టాలను పక్కన పెట్టి స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలుచేయాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ అమలుచేసిన రైతుబంధు పథకం దేశానికే ఆదర్శమని కొనియాడారు.
ఐటీ నిపుణులు వ్యవసాయం వైపు రావాలి
ఐటీ నిపుణులు కూడా సాగు వైపు రావాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి కోరారు. నూతన సాంకేతికతతో పంటలు పండించాలని పిలుపునిచ్చారు. గురువారం అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా 100 మంది యువతతో ఆన్లైన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.