Telangana | కోరుట్ల, ఆగస్టు 8: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని 9వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ పోగుల ఉమారాణి భర్త లక్ష్మీరాజం దారుణ హత్యకు గురయ్యారు. మంగళవారం ఉదయం ఓ హోటల్లో టీ తాగేందుకు వచ్చిన ఆయనను దుండగులు కత్తులతో పొడిచి చంపారు. తీవ్రంగా గాయపడ్డ లక్ష్మీరాజంను దవాఖానకు తరలిస్తుండగా ప్రాణాలు విడిచారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో హత్య జరగడం పట్టణంలో తీవ్ర సంచలనమైంది. లక్ష్మీరాజం పట్టణంలోని కార్గిల్ చౌరస్తా సమీపంలో పూరి గుడిసెలో ఉన్న హోటల్ వద్దకు మంగళవారం ఉదయం టీ తాగేందుకు వచ్చారు. ఈ సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి హోటల్ ముందు ఆగారు. ఓ వ్యక్తి బైక్‌పై నుంచి దిగి నేరుగా లక్ష్మీరాజం దగ్గరికి వచ్చాడు. ఆ సమయంలో లక్ష్మీరాజం ఫోన్లో మాట్లాడుతున్నా.. సదరు వ్యక్తిని గుర్తించి నాగరాజు బాగున్నావా అని అడిగారు. ఇంతలో వెంట తెచ్చుకున్న కత్తితో ఆ వ్యక్తి లక్ష్మీరాజంపై దాడి చేశాడు. మెడ భాగంలో పొడవటంతో కుప్పకూలిపోయాడు. పక్కనే చాయ్ తాగేందుకు వచ్చిన వారు, హోటల్ నిర్వాహకులు దుండగుడిని ఆడ్డుకునే యత్నం చేయగా కత్తిని గాల్లో ఊపుతూ బెదిరించడంతో భయపడి పక్కకు వెళ్లారు. తీవ్రంగా గాయపడ్డ లక్ష్మీరాజంను స్థానికులు అంబులెన్స్‌లో ప్రైవేట్ దవాఖానకు తరలించారు.
పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి వైద్యుల సూచన మేరకు కరీంనగర్‌కు తరలిస్తుండగా మరణించారు. ఇటీవల జరిగిన ఓ వ్యక్తి హత్య వెనుక లక్ష్మీరాజం హస్తం ఉందనే అనుమానంతో పట్టణానికి చెందిన నాగరాజు, త్రిమూర్తి, వంశీ, సత్యనారాయణ ఈ ఘాతుకానికి ఒడిగట్టారని మృతుడి భార్య, బంధువులు ఫిర్యాదు చేసినట్టు ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తులో ఉంది. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. కాగా.. లక్ష్మీరాజంపై దాడి జరిగిన విషయం తెలియగానే బీఆర్ఎస్ రాష్ట్ర నేత కల్వకుంట్ల సంజయ్ వెంటనే కోరుట్లకు చేరుకున్నారు. ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. లక్ష్మీరాజం మృతి తనను కలచివేసిందని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
అండగా ఉంటాం : మంత్రి కేటీఆర్
బీఆర్ఎస్ నేత పోగుల లక్ష్మీరాజం మృతిపై ఐటీ శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ సంతాపం తెలిపారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్వకుంట్ల సంజయ్‌కి ఫోన్ చేసి హత్యకు గల కారణాలను తెలుసుకున్నారు. ఉమారాణి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు.