పాపాయికి తల్లిపాలు అత్యావశ్యకం. కానీ అవి పట్టేందుకు అమ్మకి ఎన్ని అగచాట్లో. ఎంత పెద్ద వేడుకైనా ఓ మూలకే పరిమితమవుతుంది. ప్రయాణాలంటేనే గాబరా పడుతుంది. ఇంట్లోనూ రోజులో ముప్పావు వంతు గదిచాటునే గడుపుతుంది. పాలిచ్చేందుకే మార్కెట్లో కొన్ని దుస్తులున్నా వాటిపైనా ఓ పరదా కప్పాల్సిందే. ఇలాంటి సమస్యలేవీ లేకుండా నలుగురిలోనూ చంటి బిడ్డకి ధైర్యంగా పాలిచ్చేలా ప్రత్యేక డిజైన్‌ను రూపొందించారు హైదరాబాద్‌కి చెందిన ఈ అత్తాకోడళ్లు. జిప్పులు, హుక్కుల గోల లేకుండా సౌకర్యంగా ఉండే వీటికి పేటెంట్నూ సాధించారు. ఆ బ్రాండ్ పేరు మీరా భరద్వాజ్ అయితే, ఆ అత్తా కోడళ్లు తోలేటి సీతామహాలక్ష్మి, కాదంబినిలు. తమ జీవితం నుంచే ఈ ఆలోచన వచ్చిందని చెబుతున్న వీళ్లతో ‘జిందగీ’ మాట కలిపింది. ఆ ప్రయాణం కాదంబిని మాటల్లోనే..
పురిటి తర్వాత తొలినెలల్లో రోజుకు పదిపన్నెండుసార్లు బిడ్డకు స్తన్యమివ్వాల్సి వస్తుంది. ఇంట్లో అయినా బయట అయినా అన్నిసార్లూ అమ్మ ఏదో ఒక చాటునే కూర్చుంటుంది. నలుగురిలో కూర్చుని అన్నం తినేంత అవకాశం కూడా చాలాసార్లు ఉండదు. అది తల్లిని ఒంటరితనానికి గురిచేస్తుంది. తొలిపాప పుట్టినప్పుడు నేనూ ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నా. కుటుంబంలోని ఓ వేడుకకు వెళ్లాల్సి వచ్చినప్పటికి నా కూతురు మీరాకి ఆరు నెలలు. పెండ్లికి వెళ్లానే కానీ, బిడ్డకు పాలివ్వాల్సి రావడంతో దాదాపు సమయమంతా గదిలోనే గడిచిపోయింది.
బిడ్డకు పాలిచ్చేందుకు వీలుగా రొమ్ము భాగంలో జిప్పులు ఉండే డ్రెస్సులేవో తెప్పించుకున్నా అవీ గుచ్చుకుంటూ అసౌకర్యంగా ఉండేవి. పాలు పట్టేందుకు సరైన పొజిషన్లో కూడా ఆ జిప్పులు లేవని అప్పుడే అర్థమైంది. అది పూర్తిగా తెరుచుకోనప్పుడు పాపాయికీ ఇబ్బందిగానే ఉండేది. దీనికి ఏదో ఒక పరిష్కారం వెతకాలని భావించి ఆ సందర్భంలోనే ఒక డిజైన్ని నా మనసులో అనుకున్నా. అదే విషయాన్ని అత్తయ్యతో పంచుకున్నా. ఆమెకు కుట్టు మిషన్కి సంబంధించి మంచి పట్టు ఉంది. మా డ్రెస్‌లలో మార్పులూ చేర్పులూ చేసేవారు. అందుకే నా సమస్యకు పరిష్కారం కోసం ఆమెతో కలిసి ఆలోచన చేశా.
మనది వేడి వాతావరణం. అందులోనూ బిడ్డకు పాలిచ్చేటప్పుడు మృదువుగా ఉండే దుస్తులు ఎంచుకోవాలి. అందుకే కాటన్నే ఎంచుకున్నాను ఈ డిజైన్ కోసం. అత్తయ్యకు సృజనాత్మకంగా ఆలోచించే స్వభావం ఉండటంతో నా మనసులోని డిజైన్ని చెప్పి అలా ట్రై చేశాం. అత్తయ్య వేసుకుని చూసి మరిన్ని మార్పులు చేశారు. చివరికి సౌకర్యవంతంగా ఉండేలా ఓ మాడల్ సిద్ధం చేసుకున్నాం. దీనికి మాకు దాదాపు రెండు నెలలు పట్టింది. ఇక, నేను అమెరికాలో ఉండటంతో ఇండియా నుంచే తొలిగా కొన్ని డ్రెస్‌లను కుట్టించి తెప్పించుకున్నా.

అవి ఎలాంటి ఇబ్బందీ లేకుండా నలుగురిలోనూ పాలిచ్చేందుకు వీలుగా కుదిరాయని స్వయంగా తెలుసుకున్నా. నాకు ఇంత సౌకర్యంగా అనిపించిన ఈ డిజైన్‌ను చుట్టు పక్కల వారికీ పరిచయం చేయాలనిపించి, పాపాయి పేరు మీదుగానే ‘మీరా భరద్వాజ్’ ఫీడింగ్ డ్రెసెస్ బ్రాండ్‌ను ప్రారంభించాం. ‘ఉయ్ ఆర్ మీరా భరద్వాజ్’ (wearemeerabharadwaj) పేరిట ఉన్న ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్, వాట్సప్ ద్వారా అమ్మకాలు మొదలుపెట్టాం. నోటి మాట ద్వారానే ఇది ఎంతో మందికి చేరువైంది. అలా 2019 చివర్లో సంస్థ మొదలు పెడితే, అతి కొద్ది సమయంలోనే మంచి ఆదరణ వచ్చిందీ డిజైన్‌కి.
చూసేందుకు ఈ దుస్తులు సాధారణ కాటన్ డ్రెస్‌లు, కుర్తీల్లాగే ఉంటాయి. కానీ రొమ్ము భాగానికి కొద్దిగా కిందగా ఒక తెరిచే అమరిక ఉంటుంది. లోపలి వైపు డ్రెస్‌ని పట్టి ఉంచేలా మెత్తటి ఎలాస్టిక్, పై భాగాన్ని మూసి ఉంచేందుకు నడుము పక్కగా బొందు కట్టుకునే ఏర్పాటూ ఉంటాయి. అంటే పాపాయికి పాలు పట్టాలనుకున్నప్పుడు ఈ బొందును వదులు చేసి పై భాగాన్ని తెరిస్తే చాలు ఎంచక్కా అది బిడ్డ తల మీద కప్పినట్టుగా వచ్చి పాలిచ్చే సౌకర్యాన్ని కల్పిస్తుంది.
ఎక్కడా ఎబ్బెట్టుగా కనిపించకుండా ఉండటం దీని ప్రత్యేకత. చాలా మంది పసిపిల్లల తల్లుల ఆదరణ పొందిన ఈ డిజైన్ పేటెంట్ కోసం దాదాపు మూడేండ్లు ప్రయత్నాలు చేశాం. అలా 2023లో ఈ డ్రెస్ డిజైన్‌కు పేటెంట్ కూడా వచ్చింది. తొలి ఏడాదిలోనే మా సంస్థ 36 లక్షల టర్నోవర్ చేయగా, ప్రస్తుతం అది కోటి రూపాయలకు చేరింది. క్లాత్ షాపింగ్, స్టిచింగ్, పార్సిల్స్లాంటివన్నీ అత్తయ్య చూసుకుంటే అడ్వర్టయిజ్మెంట్, ఆన్లైన్ వ్యవహారాలు నేను చూసుకుంటా. నేను అమెరికాలో సైకోథెరపిస్టుగానూ పనిచేస్తున్నా. ఇప్పుడు నాకు రెండో పాప కూడా ఉంది. దానికి రెండున్నరేండ్లు.
తల్లీబిడ్డలిద్దరికీ అనుకూలంగా ఉండటానికి, మన వాతావరణానికి సరిపడేలా ఎక్కువగా చేనేత కాటన్‌తో వస్ర్తాలు తయారు చేసినా పండుగల వేళ ధరించేలా షిఫాన్, రా సిల్క్లాంటి వాటితో ఫెస్టివ్వేర్నూ తయారు చేస్తున్నాం. ఎ లైన్ కట్, ప్రిన్సెస్ కట్, అనార్కలీ… ఇలా వివిధ మాడళ్లలో వీటిని దాదాపు అవసరమైన అన్ని సైజుల్లో అందుబాటులోకి తెచ్చాం. ముఖ్యంగా ప్రయాణాలకు మా డిజైన్లు బాగా అనువుగా ఉంటాయని చెబుతారు కస్టమర్లు.
ఒక్క ప్రయాణం విషయమనే కాదు, పాలిచ్చే తల్లులు డ్రెస్సింగ్ విషయంలో ఏదో కోల్పోయామన్న భావన లేకుండా చక్కగా నలుగురిలో కలిసిపోయి సౌకర్యంగా ఉండాలనే ప్రయత్నమే మాది. ఒక్కొక్క కస్టమర్ అయితే మీరా భరద్వాజ్ నుంచి నేను కొన్న తొమ్మిదో డ్రెస్ అంటూ రివ్యూలు రాస్తుంటే సంతోషంగా అనిపిస్తుంది. మరికొందరు నా ఫస్ట్ డెలివరీ అప్పుడు మీరెక్కడున్నారు అంటూ ప్రేమగా అడుగుతుంటే ఆనందమనిపిస్తుంది. మన కోసం మనం చేసుకున్న ఓ ఆలోచన ఇంత మంది తల్లులకు సౌకర్యాన్ని కల్పిస్తుందంటే ఎవరికైనా సంతోషమేగా మరి!

ఒకరంటే ఒకరికి పడదు అనే అభిప్రాయం ఉంటుంది. కానీ వాళ్లిద్దరి మధ్యా చక్కని సమన్వయం ఏర్పరచుకుంటే జీవితంతో పాటు మా లాగా వ్యాపారంలోనూ విజయం సాధించవచ్చు. ఎందుకంటే నా బలాలేంటి, ఏయే పనులు నేను బాగా చేయగలను అన్నది మా అత్తయ్యకి బాగా తెలుసు. తను ఎంత ప్రత్యేకంగా ఆలోచిస్తారు, పనిని ఎంత డిసిప్లీన్గా పూర్తి చేస్తారు అన్నది నాకూ అవగాహన ఉంది. ఇలా ఉండటం వల్ల పని విభజన సులభం అవుతుంది. ఒకరి మీద ఒకరికి నమ్మకం ఏర్పడుతుంది. బిజినెస్‌లో ముందుకు వెళ్లాలంటే ఈ సమన్వయం చాలా అవసరం. అందుకే మంచి అత్తా కోడళ్లుగానూ మేం విజయం సాధించామని చెబుతా.
నేను ఒకసారి తిరుపతి వెళ్లినప్పుడు అక్కడ ఒక అమ్మాయి చంటి పిల్లకి పాలు ఇస్తోంది. అప్పుడామె వేసుకున్నది మా డ్రెస్సే అని గుర్తించి వెళ్లి అడిగా. ఆమె అవుననడమే కాదు, నన్ను కూడా గుర్తు పట్టి ఇలాంటి ఆలోచతో డ్రెస్‌లు తయారు చేస్తున్నందుకు ఎంతగానో థ్యాంక్స్ చెప్పింది.
‘నేను క్యూ లైన్లోనూ కంఫర్టబుల్‌గా పాపకు పాలు ఇచ్చాను ఆంటీ, నిజంగా
ఆనందమేసింది. నిజానికి నేను కాలేజీలో టాపర్‌ని. మా పిల్లలు డాక్టర్లు, ఐఐటీయన్లు అయినా… వ్యక్తిగతంగా నేను ఇంటికే పరిమితమయ్యాననే వెలితి ఉండేది. మీరా భరద్వాజ్ ద్వారా నేను అరవైల్లో ఆంత్రప్రెన్యూర్‌గా మారాను. మా కోడలి చక్కని సమన్వయం వల్లే ఇది సాధ్యమైంది. కాస్త సృజనాత్మకత, చేయాలన్న తపన ఉంటే వయసుతో సంబంధం లేకుండా మనకంటూ గుర్తింపు తెచ్చుకోవచ్చు.
-లక్ష్మీహరిత ఇంద్రగంటి