హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): సులభంగా, వేగంగా నిధుల సమీకరణ కోసం భూములను అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో రాష్ట్రవ్యాప్తంగా అమ్మకానికి సిద్ధంగా ఉన్న భూములను గుర్తించాలని అధికారులను ఆదేశించినట్టు విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. ప్రధానంగా టీఎస్ఐఐసీ పరిధిలో ఉన్న భూములపై ఫోకస్ పెట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ శాఖ పరిధిలోని భూములను ఇప్పటికే అభివృద్ధి చేసి, మౌలిక వసతులుకల్పించి సిద్ధంగా ఉంచుతారు కాబట్టి అమ్మడం సులభం అవుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. పక్కనే పరిశ్రమలు కూడా ఉంటాయి కాబట్టి ధర కూడా బాగా పలుకుతుందని, తద్వారా సులభంగా, వేగంగా, అనుకున్న స్థాయిలో నిధుల సమీకరణ సాధ్యమవుతుందని అంచనా వేస్తున్నారు. ఇతరచోట్ల అయితే భూముల సేకరణ, వాటిని అభివృద్ధి చేయడం ఆ తర్వాత వేలం వేయడానికి చాలా సమయం పడుతుంది. ఈ క్రమంలో మొదట బుద్వేల్లోని దాదాపు 75 ఎకరాలను విక్రయించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీచేసినట్టు తెలిసింది. అక్కడ ఎకరానికి సుమారు రూ.50-55 కోట్ల మేర ధర పలుకుతున్నది. వీటి అమ్మకం ద్వారా రూ.4వేల కోట్ల వరకు నిధుల సమీకరణ చేయవచ్చని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. అక్కడ వచ్చే స్పందనను బట్టి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఇతర భూములను విక్రయించడంపై దృష్టిపెట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండగా భూముల అమ్మకంపై నానా యాగీ చేసిన సంగతిని ఈ సందర్భంగా పలువురు గుర్తు చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం భూములను అమ్మినప్పుడల్లా తీవ్ర విమర్శలు చేసి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా అమ్ముతారని ప్రశ్నిస్తున్నారు.
ఫార్మాసిటీ భూములను ఏం చేస్తారు?
ముచ్చర్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మాసిటీ ఏర్పాటు కోసం సుమారు 10వేల ఎకరాలను సేకరించిన సంగతి తెలిసిందే. ఈ భూములను అభివృద్ధి చేసి, పారిశ్రామికవేత్తలకు కేటాయించేందుకు సిద్ధం చేసింది. పనులు చివరి దశలో ఉండగా ప్రభుత్వం మారింది. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఫార్మాసిటీని రద్దు చేయడంతో దాదాపు 10వేల ఎకరాలు ప్రభుత్వానికి అందుబాటులోకి రానున్నాయి. వీటిని ఏం చేస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.