హైదరాబాద్, నవంబర్ 10(నమస్తే తెలంగాణ): రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలి పీఠం కోసం పోటీ పెరుగుతున్నది. మొన్నటి వరకు ఇద్దరే పోటీలో ఉండగా, తాజాగా రేసులోకి మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. టీపీసీసీ జనరల్ సెక్రటరీ పారిజాత నర్సింహారెడ్డి పేరును టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ ప్రతిపాదించినట్టుగా తెలిసింది.
ఈ మేరకు జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లాంబకు లేఖ రాసినట్టుగా సమాచారం. కాగా, సీఎం రేవంత్‌రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుపై అసంతృప్తిగా ఉన్నట్టు తెలిసింది. దీంతో సరితా తిరుపతయ్య పేరును సీఎం ప్రతిపాదించగా, దీనిపై అప్పట్లో సునీతారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. వీరిలో అధ్యక్ష పీఠం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తిగా మారింది.