Telangana | యాసంగి వడ్లకు చోటేది?.. గత యాసంగి, వానకాలం ధాన్యం ఇంకా మిల్లుల్లోనే
యాసంగి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. కానీ కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎక్కడ పెట్టాలన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఎందుకంటే.. గత ఏడాది యాసంగి, మొన్నటి వానకాలం సీజన్ ధాన్యం మొత్తం మిల్లుల్లోనే పేరుకుపోవటంతో మిల్లులన్నీ ధాన్యంతో నిండిపోయాయి.
- సీఎంఆర్ ఆలస్యం, టెండర్ల ధాన్యం ఎత్తడంలో వైఫల్యం
- మిల్లుల్లోనే మూలుగుతున్న 80 లక్షల టన్నుల ధాన్యం
- పాత ధాన్యం తరలిస్తేనే కొత్త ధాన్యం దించుకొంటాం
- స్పష్టం చేస్తున్న మిల్లర్లు.. జిల్లాల కలెక్టర్లకు లేఖలు
Telangana | హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): యాసంగి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. కానీ కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎక్కడ పెట్టాలన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఎందుకంటే.. గత ఏడాది యాసంగి, మొన్నటి వానకాలం సీజన్ ధాన్యం మొత్తం మిల్లుల్లోనే పేరుకుపోవటంతో మిల్లులన్నీ ధాన్యంతో నిండిపోయాయి. దీంతో ఈ యాసంగి ధాన్యం నిల్వ చేసే పరిస్థితి లేకుండా పోయింది. దీనికి పౌరసరఫరాల సంస్థ, మిల్లర్ల నిర్లక్ష్యమే కారణమన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఓవైపు మిల్లర్లు సీఎంఆర్ ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించగా, మరోవైపు టెండర్లలో విక్రయించిన గత యాసంగి ధాన్యాన్ని ఆయా సంస్థలు ఎత్తడం లేదు. ఈ నేపథ్యంలో ఈ యాసంగి ధాన్యాన్ని దించుకునేందుకు మిల్లర్లు ససేమిరా అంటున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ధాన్యం కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉన్నది.
మిల్లుల్లో మూలుగుతున్న 80 లక్షల టన్నుల ధాన్యం
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మిల్లుల్లో 80 లక్షల టన్నులకు పైగా ధాన్యం నిల్వ ఉన్నట్టు సమాచారం. ఇక ఈ యాసంగి సీజన్లో సుమారు 75 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు పౌరసరఫరాల సంస్థ ప్రణాళికలు రూపొందించింది. అంటే మిల్లుల్లో మొత్తంగా 1.55 కోట్ల టన్నుల ధాన్యం నిల్వ చేయాల్సి వస్తుంది. అవసరమైన వసతులు లేనందున ఈ స్థాయిలో నిల్వ సాధ్యం కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2022-23 యాసంగికి సంబంధించి 38 లక్షల టన్నుల ధాన్యం, 2023-24 వానకాలం సీజన్ ధాన్యం 43 లక్షల టన్నులు మిల్లుల్లోనే ఉన్నాయి.
ఏడాదైనా సీఎమ్మాఆర్ ఇవ్వలేదు
2022-23 యాసంగికి సంబంధించి 66.84 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, ఇందులో 35 లక్షల టన్నుల ధాన్యాన్ని వేలం ద్వారా విక్రయించారు. మిగిలిన 32 లక్షల టన్నుల ధాన్యానికి సంబంధించి సుమారు 22 లక్షల టన్నుల సీఎమ్మార్(బియ్యం) ఇవ్వాల్సి ఉండగా, ఇందులో 19 లక్షల టన్నులు మాత్రమే అందజేశారు. ఇంకా 3 లక్షల టన్నుల సీఎమ్మార్ బకాయిలు ఉన్నాయి. 3 లక్షల టన్నుల బియ్యానికి సంబంధించి, 4.5 లక్షల టన్నుల ధాన్యం ఇంకా మిల్లుల్లోనే ఉన్నది. ఇక, మొన్నటి వానకాలానికి సంబంధించి ప్రభుత్వం 47.33 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. ఇందుకు 32 లక్షల టన్నుల సీఎమ్మార్(బియ్యం) ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సి ఉంటుంది. వానకాలం సీఎమ్మార్ ప్రారంభమై ఐదు నెలలు పూర్తవుతున్నా, 3 లక్షల టన్నుల సీఎమ్మార్ మాత్రమే ఇవ్వడం గమనార్హం. అంటే ఇంకా 29 లక్షల టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉన్నది. ఇందుకు సంబంధించిన 43 లక్షల టన్నుల ధాన్యం మిల్లుల్లోనే ఉన్నది.
టెండర్ల ధాన్యం ఎత్తడం లేదు
వేలంలో ధాన్యాన్ని దక్కించుకున్న సంస్థలు మిల్లుల నుంచి ఎత్తటంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనల ప్రకారం వారికి కన్ఫర్మేషన్ లెటర్ ఇచ్చిన 90 రోజుల్లో ధాన్యం మొత్తం ఎత్తేయాలి. ఇప్పటికి 50 రోజులు పూర్తయినా 5-10 వేల టన్నుల ధాన్యాన్ని మాత్రమే ఎత్తినట్టు తెలిసింది. దీంతో కొత్త ధాన్యం పెట్టేందుకు స్థలం సరిపోని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకు సగం ధాన్యం ఎత్తినా పరిస్థితి మరోలా ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మిల్లుల్లో చోటులేదని తెలిసినా, కొత్త ధాన్యం పెట్టేందుకు ఇబ్బందులు ఎదురవుతాయని తెలిసినా.. ధాన్యం ఎత్తేందుకు 90 రోజుల గడువు ఇవ్వటం ఏమిటని పౌరసరఫరాల సంస్థపై విమర్శలు వస్తున్నాయి. గతంలో మాదిరి 45 రోజుల గడువు ఇస్తే ఇప్పటికే ధాన్యం ఎత్తేవారని, ఇప్పుడు ఈ ఇబ్బంది వచ్చేది కాదని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
మేం ధాన్యం దించుకోం: మిల్లర్లు
ఈ యాసంగిలో కొన్న ధాన్యాన్ని దించుకొనేందుకు మిల్లర్లు నిరాకరిస్తున్నారు. ఇప్పటికే తమ మిల్లుల్లో ధాన్యం పేరుకుపోయిందని, కొత్త ధాన్యం పెట్టేందుకు స్థలం లేదని తెగేసి చెప్తున్నారు. ఈ మేరకు మిల్లర్లు పలు జిల్లాల్లో కలెక్టర్లకు లేఖలు కూడా రాశారు. దీంతో ధాన్యం ఖాళీ చేయించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు పౌరసరఫరాల శాఖకు లేఖలు రాసినట్టు తెలిసింది. ఇటీవల నిర్వహించిన సమీక్షలోనూ జిల్లాల జాయింట్ కలెక్టర్లు ఈ అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చినట్టు సమాచారం. ఒకవేళ మిల్లర్లు ధాన్యం దించుకోని పక్షంలో కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయి రైతులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. సమస్యను ప్రభుత్వం వీలైనంత త్వరగా పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajanna Sircilla | చెరువులో మునిగి యువకుడి మృతి.. తండ్రికి దూరమైన ముగ్గురు చిన్నారులు!
భువనగిరి అరోరా కాలేజీలో కలకలం.. విద్యార్థినుల ఫొటోలు, వీడియోలు లీక్.. వైరల్ అవుతున్న ఆడియో కాల్!
Donald Trump | నాకు 8 నోబెల్ శాంతి బహుమతులు రావాల్సింది.. డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి..!
Earthquake | పనామాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు..!
Nara Lokesh | ‘రణబాలి’ ట్రైలర్‌పై నారా లోకేష్ ప్రశంసలు.. విజయ్ దేవరకొండ నటనకు ఫిదా!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

