Etela Rajender | హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): బీజేపీ నుంచి ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరికొందరు నేతలు ఇంటికి వెళ్లిపోవడం ఖాయమైనట్టు సమాచారం. తగిన సమయం చూసుకొని బండి సంజయ్‌కి ఝలక్ ఇవ్వాలని వారు భావిస్తున్నట్టు తెలిసింది. శనివారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తో భేటీ అనంతరం వారిద్దరూ పార్టీని వదిలేయాలని గట్టిగా నిర్ణయించుకున్నట్టు పార్టీలో చర్చ జరుగుతున్నది. ఇద్దరు నేతలు పార్టీకి అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారని అధిష్ఠానానికి ఎప్పటినుంచో సమాచారం ఉన్నది. ఇంటింటీకి బీజేపీ కార్యక్రమానికి వీరిద్దరూ డుమ్మా కొట్టడంతో హుటాహుటిన ఢిల్లీ రావాలని వారికి పిలుపు వచ్చింది.
దీంతో రాష్ట్ర బీజేపీలో కీలక పరిణామాలు ఖాయమంటూ చర్చ సాగింది. అమిత్‌షాతో చర్చ సందర్భంగా ప్రధానంగా బండి సంజయ్‌ని అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేసినట్టు తెలిసింది. బండి ఒంటెత్తు పోకడలు, అవగాహనా రాహిత్యం, కోటరీ వ్యవస్థ వంటి అంశాలన్నింటిని అమిత్‌షాకు వివరించినట్టు సమాచారం. ఇలాగే కొనసాగితే పార్టీకి కనీసం డిపాజిట్లు కష్టమేనని కుండబద్దలు కొట్టినట్టు చర్చ జరుగుతున్నది. ఇదే సమయంలో ఈటలకు ఎన్నికల ప్రచార కమిటీ పదవి గురించి స్పష్టమైన హామీ వస్తుందని వారు భావించారు. అమిత్‌షా నుంచి ఎలాంటి స్పష్టమైన నిర్ణయం రాకపోవడంతో ఇద్దరూ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారని, అందుకే భేటీ అనంతరం ముక్తసరిగా మీడియాతో మాట్లాడి, అసంతృప్తిని బయటపెట్టారని సమాచారం. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదివారం పాల్గొన్న నాగర్‌కర్నూల్ సభకు ఇద్దరూ గైర్హాజరు కావడం తీవ్ర చర్చనీయాంశం అయింది. దీంతో పార్టీ మారడంపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్టు చెప్పుకొంటున్నారు.
ఇటీవల ఖమ్మంలో అమిత్‌షా సభ రద్దయిన సంగతి తెలిసిందే. గుజరాత్లో తుఫాన్ కారణంగానే సభను రద్దు చేశామని బీజేపీ చెప్పుకొంటున్నా.. వాస్తవానికి ఖమ్మం సభకు ఈటల, కోమటిరెడ్డి వంటి కీలక నేతలు గైర్హాజరు అవుతారన్న పకా సమాచారం షాకు చేరినట్టు తెలిసింది. బండి అతివల్లే ఈ దుస్థితి ఏర్పడిందని నివేదిక అందినట్టు సమాచారం. తన సభకు ముఖ్యనేతలు రాకుంటే పరువు పోతుందనే ఉద్దేశంతో అమిత్‌షా పర్యటన రద్దు చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. నాగర్‌కర్నూల్‌లో జేపీ నడ్డా సభకు కూడా ఇద్దరు నేతలు హాజరు కాకపోవడం బీజేపీకి మరో షాక్ అని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
పలువురు పార్టీ నేతలు ఇటీవల బండి ఇంటికి వెళ్లి.. ‘పార్టీ పరువుని మంటగలుపుతున్నావని, అధ్యక్ష బాధ్యత నిర్వహించే విధానం ఇది కాదు’ అని ముఖం మీద చెప్పినట్టు సమాచారం. చేతనైతే అందరినీ కలుపుకొని వెళ్లాలని, లేకపోతే పదవి నుంచి తప్పుకోవాలని ఘాటుగా వ్యాఖ్యానించినట్టు తెలిసింది. బయటికి కనిపించేంత గొప్ప వ్యక్తివి కాదని, కనీసం నీ మనుషులను కూడా కాపాడుకోలేకపోతే ఇంకా ఏం ప్రయోజనమని విమర్శించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. మొత్తంగా బండి సంజయ్ వైఖరి వల్ల బీజేపీ దాదాపు ఖాళీ అయ్యే అవకాశం ఉన్నదని చెప్పుకొంటున్నారు. రెండు రోజుల్లో మొదలుపెట్టి బీజేపీకి వరుసగా షాకుల మీద షాకులు తగిలే అవకాశం ఉన్నదని పేరొంటున్నారు.
బీఆర్ఎస్ బహిషృత నేతలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావును బీజేపీలో చేర్చుకొనేందుకు ఈటల బృందం ఇటీవల కసరత్తు చేసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఆ సమావేశాలు చేరికల కోసం కాదని, వారిద్దరితోపాటు ఈటల, మరికొందరు బీజేపీ అసంతృప్త నేతలు కలిసి కొత్త వేదికను ఏర్పాటు చేసుకొనే దిశగా చర్చలు జరిగాయని ప్రచారం సాగింది. తాము చేరికల కోసం ప్రయత్నిస్తుంటే.. పొంగులేటి, జూపల్లి కలసి తమకు రివర్స్ కౌన్సెలింగ్ ఇస్తున్నారని ఈటల మీడియాతో చెప్పిన సంగతి తెలిసిందే. పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖాయమైంది. తర్వాత కొన్నాళ్లకు ఈటల, కోమటిరెడ్డి, జితేందర్‌రెడ్డి, కొండ విశ్వేశ్వర్‌రెడ్డి వంటి బీజేపీ అసంతృప్త నేతలు కూడా కాంగ్రెస్‌లోకి క్యూ కడతారని ప్రచారం సాగుతున్నది.