హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): మాజీ మంత్రి, రాజ్యసభ మాజీ సభ్యుడు డీ శ్రీనివాస్ జీవితాంతం లౌకికవాదిగా ఉన్నారని, బీజేపీ, ఆరెస్సెస్ సిద్ధాంతాలను ఎప్పుడూ అంగీకరించలేదని, అలాంటి నేత విగ్రహాన్ని బీజేపీ నాయకుడితో ఆవిష్కరించడం వల్ల ఆయన ఆత్మ క్షోభిస్తుందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గాంధీభవన్‌లో టీపీసీసీ ఆధ్వర్యంలో డీఎస్ ప్రథమ వర్ధంతిని నిర్వహించారు. డీఎస్ చిత్రపటానికి మహేశ్‌కుమార్‌గౌడ్, పొన్నం ప్రభాకర్‌తోపాటు ఎంపీలు మల్లు రవి, అనిల్‌కుమార్‌యాదవ్, మాజీ ఎంపీ వీ హనుమంతరావు, పలుకార్పొరేషన్ల చైర్మన్లు, పీసీసీ ఉపాధ్యక్షులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ.. డీఎస్ తనలాంటి ఎందరికో రాజకీయ ఓనమాలు నేర్పారని గుర్తుచేసుకున్నారు. డీఎస్ విగ్రహం ఏర్పాటుకు నిజామాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చొరవతో రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించిందని చెప్పారు. కానీ కాంగ్రెస్ నాయకుడైన డీఎస్ విగ్రహావిష్కరణకు తమ పార్టీ నాయకులను ఆహ్వానించకపోవడం దారుణమని పేర్కొన్నారు. డీఎస్ కుమారుల వ్యవహారంతో ఆయన ఆత్మ క్షోభిస్తుందని చెప్పారు. త్వరలో హైదరాబాద్‌లో మాజీ మంత్రి ఎం ముఖేశ్‌గౌడ్ విగ్రహావిష్కరణ చేపడతామని, ఇందుకు అవసరమైన స్థలాన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని తెలిపారు.