Minister Komatireddy | యాదాద్రి భువనగిరి, జనవరి 24 (నమస్తే తెలంగాణ): అందరికీ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తేల్చిచెప్పారు. చదువుకున్నోళ్లందరికీ ప్రభుత్వ కొలువులు ఇవ్వలేమని, అర్హులకు మాత్రం అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో బుధవారం పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వం విప్ బీర్ల ఐలయ్యతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగాలకు అర్హులు అయితే యాదగిరిగుట్ట మెడికల్ కాలేజీలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు ఇస్తామని పేర్కొన్నారు.
మెడికల్ కళాశాలలోని ప్రతి విభాగంలో యువతకు ఉపాధి కల్పిస్తామని తెలిపారు. త్వరలోనే 60 వేల మంది టీచర్లు రిటైర్ కాబోతున్నారని, మెగా టీచర్స్ జాబ్‌మేళాను సీఎం ప్రకటించారని తెలిపారు. ఫిబ్రవరిలోనే రిక్రూట్మెంట్ ఉంటుందని పేర్కొన్నారు. ఒక్క పర్యటనలోనే ఆలేరు నియోజకవర్గానికి రూ.100 కోట్లు ఇచ్చినట్టు చె ప్పారు. ఆలేరు ప్రాంతానికి సాగునీరు అం దిస్తామని, బస్వాపూర్ ప్రాజెక్టుతోపాటు గం ధమల్ల రిజర్వాయర్‌ను పూర్తిచేస్తామని వివరించారు. ఈ నెల 26న నల్లగొండలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ భవన నిర్మాణ పను లు ప్రారంభిస్తామని తెలిపారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. ప్రెసిడెన్షియల్ సూ ట్లో వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, ఈవోతో సమీక్ష నిర్వహించారు.