KCR | హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌కు మళ్లీ నోటీసులు ఇవ్వడం చట్టపరంగా కుదరదు అని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మోహిత్‌రావు స్పష్టంచేశారు. అసలు కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వలేకపోతుందని ఆయన తేల్చిచెప్పారు. కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడంపై శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 160 సీఆర్పీసీ కింద సాక్షిగా మాత్రమే కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇచ్చిందని తెలిపారు. అయితే మున్సిపల్ ఎన్నికల కారణంగా ప్రస్తుతం విచారణకు రాలేనని కేసీఆర్ సిట్ అధికారులకు తెలిపారని పేర్కొన్నారు. తాను ఎర్రవల్లిలో నివసిస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఎలాంటి నోటీసులైనా అకడికే పంపించాలని, విచారణ కూడా ఎర్రవల్లిలోనే చేయాలని కేసీఆర్ కోరారని గుర్తు చేశారు. 160 సీఆర్పీసీ చట్టం ప్రకారం 65 సంవత్సరాల వయసు ఉన్నవారు ఎకడ ఉంటే అధికారులు అకడికి వెళ్లి విచారణ చేయాలని చెప్పారు. కేసీఆర్‌ను హైదరాబాద్ పరిధిలోకి రావాలి అని సిట్ అధికారులు చెప్పడం చట్ట వ్యతిరేకమే అవుతుందని అన్నారు. ఒకవేళ పోలీసులు విచారించాలంటే ఎర్రవల్లిలోని ఆయన నివాసానికి వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు.
మరో పక్క 179 బీఎన్ఎస్ఎస్ ప్రొవిజన్ ప్రకారం, 65 ఏండ్ల వారిని ఇంటి వద్దనే విచారించాలన్న నిబంధనను 60 ఏండ్లకు తగ్గించారని తెలిపారు. హైదరాబాద్ పరిధిలోకి రమ్మని పిలువడం సీఆర్పీసీ చట్టానికే వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. చట్టబద్ధంగా చెప్పాలంటే కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వలేదని ఆయన తెలిపారు. జూబ్లీహిల్స్ ఏసీపీ పరిధిలోకి కేసీఆర్ ప్రస్తుతం నివాసముంటున్న ఎర్రవల్లి ఇల్లు రాదని, తన పరిధిలో లేని ప్రాంతంలో నివసిస్తున్న వ్యక్తికి నోటీసు ఇచ్చి పిలువడం చెల్లదని వివరించారు. కేసీఆర్ తన పర్మనెంట్ అడ్రెస్ నందినగర్‌లో పేర్కొన్నప్పటికీ ఆయన నివసిస్తున్న ఇల్లు ఎర్రవల్లిలో ఉన్నదని చెప్పారు. ఎక్కడ నివాసం ఉంటే అక్కడే విచారించాలని గతంలో అనేక కోర్టు తీర్పులు కూడా ఉన్నాయని మోహిత్‌రావు తెలిపారు.
ఎక్కడైనా సరే పర్మనెంట్ అడ్రస్, ప్రెజెంట్ అడ్రెస్ అని ఉంటాయని, పర్మినెంట్ అడ్రెస్లో ఆ వ్యక్తి లేకపోతే ఎక్కడ ఉంటే అక్కడ విచారణ జరుపాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా కూడా కేసీఆర్ ఉన్నారని, గడిచిన 15 ఏండ్లకుపైగా ఆయన ఎర్రవల్లిలోనే తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారని మోహిత్‌రావు గుర్తుచేశారు. కేసీఆర్ విచారణకు సహకరించబోనని ఎక్కడా చెప్పలేదని, పూర్తిగా సహకరిస్తానని చెప్పారని, తాను నివసిస్తున్న ఇంటికి రమ్మని మాత్రమే కేసీఆర్ చెప్పారని గుర్తుచేశారు. ఇక సాంకేతికంగా చూస్తే జూబ్లీహిల్స్ ఏసీపీ పరిధిలో ఎర్రవల్లి గ్రామం రాదని, అందుకే పోలీసులు 160 సీఆర్పీసీ కింద ఇచ్చిన నోటీసులు చెల్లవని స్పష్టంచేశారు.