(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఎప్పుడు ఏమి మాట్లాడుతారో తెలియని పరిస్థితి. మాట మార్చడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యగా అనేక సందర్భాలలో రుజువైంది. నిన్న మొన్నటి దాకా లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితను ఎందుకు అరెస్టు చేయడం లేదని పెడబొబ్బలు పెట్టిన రేవంత్‌రెడ్డి, తాజాగా కవితను అరెస్టు చేసేందుకు బీజేపీతో ఒప్పంద కుదిరిందని ఆరోపిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్, బీజేపీ రాజకీయంగా లబ్ది పొందడానికి కవితను అరెస్టు చేయబోతున్నారంటూ రేవంత్‌రెడ్డి చిలక జోస్యం చెబుతున్నారు.
కేంద్రంతో సీఎం కేసీఆర్ చేసుకున్న ఒప్పందం మేరకు కవితను అరెస్టు చేస్తారని తద్వారా రోడ్లపైకి వచ్చి బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు చేసి రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తున్నారని ఆరోపించారు.కేంద్రంలో ఆందోళనలు చేయడం, బీజేపీతో బీఆర్ఎస్ శ్రేణులు ఘర్షణకు దిగేలా స్క్రిప్ట్ సిద్ధం చేశారని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్-బీజేపీల మధ్య వైరం ఉన్నట్టు ప్రజలను నమ్మించి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడం ఇరుపార్టీల వ్యూహం అన్నారు. తద్వారా బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం, ప్రతిపక్ష స్థానంలో బీజేపీ ఉండే విధంగా ఒప్పందం కుదిరిందని ఆయన పేర్కొన్నారు. కవితను ఎందుకు అరెస్టు చేయరని మొన్నటిదాకా తప్పుబట్టిన రేవంత్‌రెడ్డి, తాజాగా ఆమె అరెస్టు కాబోతున్నారని పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేయటం వివాదాస్పదంగా మారింది. ‘రేవంత్‌ది నాలుకా…తాటి మట్టా’ అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.