హైదరాబాద్, డిసెంబర్ 23(నమస్తే తెలంగాణ): కొన్నాళ్లుగా ప్రభుత్వ పెద్దల తీరుపై తీవ్ర అసహనంతో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారులు సీఎం రేవంత్‌రెడ్డి ముందే తమ అసంతృప్తిని వెళ్లగక్కినట్టు తెలిసింది. పాలనలో సీఎంవో విఫలం అయ్యిందంటూ కుండబద్దలు కొట్టినట్టు సమాచారం. మొత్తంగా ఐఏఎస్‌లకు క్లాస్ పీకేందుకు సీఎం ప్రయత్నిస్తే, వాళ్లే తిరిగి ప్రభుత్వం పనితీరుపై విమర్శలు చేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం సచివాలయంలో అన్ని విభాగాల కార్యదర్శులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీనియర్ ఐఏఎస్‌ల మధ్య సమన్వయం లేదని, మీ వ్యక్తిగత గొడవలతో ప్రభుత్వ పాలసీలను నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నట్టు సమాచారం. బ్యూరోక్రాట్లు వ్యక్తిగత రాగద్వేషాలకు పోయి ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నారని వ్యాఖ్యానించారట. ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు అవుతున్నా సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లి, వాటిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంలో ఐఏఎస్‌లు విఫలం అవుతున్నారని సీఎం అన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అధికారులు జవాబుదారీతనంతో పనిచేయాలని సూచించారట.
సీఎం వ్యాఖ్యలకు సీనియర్లు గట్టిగానే బదులిచ్చినట్టు సమాచారం. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో, స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంలో సీఎంవో విఫలం అవుతున్నదని కుండబద్దలు కొట్టినట్టు సమాచారం. ఒక్కో శాఖలో ఇద్దరిద్దరు ముఖ్యకార్యదర్శులను నియమించడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయంటూ సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. ప్రతి శాఖలో ఉండే కార్యదర్శితో పాటు, సీఎంవో నుంచి మరో షాడో కార్యదర్శిని పెడుతున్నారని, ఇది తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తున్నదని స్పష్టం చేశారట. ఇటీవల గ్లోబల్ సమ్మిట్ కోసం క్షేత్రస్థాయిలో తాము కష్టపడితే క్రెడిట్ మొత్తం ప్రభుత్వ పెద్దలకు దగ్గరగా ఉండే ఉన్నతాధికారి కొట్టేశారని ఉదహరించినట్టు సమాచారం.
ఒక శాఖకు సంబంధించిన కీలక మెయిల్స్ అన్నీ సంబంధం లేని మరో అధికారి చూస్తున్నారని, ఈ విషయాన్ని అనేకసార్లు సీఎస్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని సీఎంకు వివరించినట్టు తెలిసింది. బ్యూరోక్రాట్ల సూచనతో సీఎం ఏకీభవించలేదని సమాచారం. కార్యదర్శుల పనితీరు సరిగా లేకపోవడం వల్లే సూపర్విజన్ పెట్టాల్సి వచ్చిందని తేల్చి చెప్పారట. కార్యదర్శుల పనితీరుపై సీఎస్ ప్రతినెలా సమీక్షిస్తారని, ఈమేరకు ప్రతి నెలా రిపోర్ట్ ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. మూడు నెలలకోసారి తాను స్వయంగా సమీక్షిస్తానని సీఎం అన్నారు.
అద్దె భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ విభాగాల కార్యాలయాలను వెంటనే ఖాళీ చేసి ప్రభుత్వ భవనాల్లోకి మారాలని సమీక్షలో సీఎం ఆదేశించారు. ప్రతి కార్యదర్శి తమ తమ శాఖల్లో ఉన్న రెగ్యులర్, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల పూర్తి వివరాలు జనవరి 26లోగా సీఎస్‌కు అందించాలని స్పష్టం చేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు, ఈపీఎఫ్, ఈఎస్ఐ సదుపాయం వంటివి సమయానికి అందుతున్నాయో లేదో సంబంధిత శాఖల హెచ్వోడీలు చూడాలని సూచించారు. ఈ ప్రక్రియను జనవరి 26లోగా పూర్తి చేయాలని ఆదేశించారు.