Konda Surekha | వరంగల్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వరుస వివాదాల మంత్రిగా పేరు తెచ్చుకున్న కొండా సురేఖ తీరుపై ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు తీవ్ర అసహనంతో ఉన్నట్టు తెలుస్తున్నది. సొంత పార్టీ నేతలతోనే కయ్యానికి కాలు దువ్వుతుండటం, ప్రతి నియోజకవర్గంలో పెత్తనం కోసం గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తుండటంపై ఆగ్రహంతో ఉన్న ఎమ్మెల్యేలంతా ఆమె తీరును అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. మొదటి నుంచీ మంత్రి సీతక్కతో సురేఖ ఆధిపత్య పోరు, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో వర్గపోరు వ్యవహారాలు తలనొప్పిగా మారడంతో అన్ని పరిణామాలపై కాంగ్రెస్ అధిష్ఠానం ఆరా తీస్తున్నట్టు తెలుస్తున్నది. ఉమ్మడి వరంగల్‌లోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో గ్రూపులు పెంచుతున్నారని మంత్రి సురేఖపై గుర్రుగా ఉన్న ఎమ్మెల్యేలు ఆమెను తమ నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదని పార్టీ వర్గాలే చెప్తున్నాయి. ఉమ్మడి వరంగల్‌లో 12 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ 10 సెగ్మెంట్లలో గెలిచింది. స్టేషన్‌ఘన్‌పూర్‌లో బీఆర్ఎస్ తరపున గెలిచిన కడియం శ్రీహరి కాంగ్రెస్‌లో చేరారు. వరంగల్ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సురేఖకు ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలతో విభేదాలు కొనసాగుతున్నాయి.
ఇద్దరు మంత్రుల మధ్య ఆదినుంచీ..
సీతక్క, సురేఖ మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన కొద్దిరోజుల నుంచే వారి మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. మేడారం మహా జాతర నుంచి వీరి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. జాతర సమయంలో దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ అక్కడ కీలకంగా వ్యవహరించాలని భావించారు. ములుగు సొంత జిల్లా కావడంతో మంత్రి సీతక్క అన్నీతానై వ్యవహరించి జాతర ఏర్పాట్లు, పనుల్లో సురేఖ జోక్యం లేకుండా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వరంగల్‌లో నిర్మించిన ధార్మిక భవన్లో మేడారం ఈవో కార్యాలయం, వేద పాఠశాలకు వసతిపై ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. అప్పటి నుంచి మంత్రులు సురేఖ, సీతక్క కలిసి ఒకే కార్యక్రమంలో పాల్గొనటం లేదు. సీఎం పర్యటనలో ఎక్కడా కనిపించడం లేదు.
పరకాలలో నిత్య కొట్లాటలు
మంత్రి సురేఖ గతంలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన పరకాలలో కాంగ్రెస్ వర్గపోరు తీవ్రస్థాయిలో ఉన్నది. పరకాల ప్రస్తుత ఎమ్మెలే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, సురేఖ అనుచరుల మధ్య కొట్లాటలు జరుగుతున్నాయి. ఇటీవల రేవూరికి, సురేఖకు ఫోన్లో జరిగిన వాగ్వాదం వైరల్‌గా మారింది. దసరా ఫ్లెక్సీలో ఫొటో విషయమై చెలరేగిన వివాదంతో వారిద్దరి మధ్య మరోసారి విభేదాలు తీవ్రమై పంచాయితీ కాస్తా ముఖ్యమంత్రి వద్దకు చేరింది.
సీనియర్లలో అసంతృప్తి
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నేతలుగా ఉన్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితో మంత్రి సురేఖకు దశాబ్దాలుగా విభేదాలున్నాయి. మొదటి నుంచీ పార్టీలో ఉన్న తమకు కాకుండా పార్టీలు మారి వచ్చిన సురేఖకు మంత్రి పదవి ఇవ్వడంపై వీరిద్దరూ అసంతృప్తితో ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే కడియం ఇప్పటి వరకు సురేఖను తన సెగ్మెంట్లో ఒక్క కార్యక్రమానికీ రానివ్వలేదు. దీంతో సురేఖకు, కడియం శ్రీహరికి మధ్య విభేదాలు మరింత పెరిగాయి.
అన్ని నియోజకవర్గాల్లోనూ అంతే..
పరామర్శల పేరుతో భూపాలపల్లి నియోజకవర్గంలో సురేఖ పార్టీలో గ్రూపులను ప్రోత్సహిస్తున్నారని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అసంతృప్తితో ఉన్నారు. వివిధ కార్యక్రమాలకు సురేఖను కాదని మంత్రులు సీతక్క, శ్రీధర్‌బాబును పిలుస్తున్నారు. ఇక పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి సైతం కొన్ని నెలలుగా సురేఖతో దూరంగానే ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి పాలకుర్తిలో పోటీ చేస్తారని అనధికారికంగా కాంగ్రెస్ క్యాడర్‌తో చర్చించడంపై యశస్వినిరెడ్డి కినుక వహించి సురేఖతో దూరంగా ఉంటున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వర్ధన్నపేట, డోర్నకల్, మహబూబాబాద్ ఎమ్మెల్యేలు నాగరాజు, రాంచంద్రునాయక్, మురళీనాయక్ ఏ కార్యక్రమానికీ సురేఖను ఆహ్వానించడంలేదు.