హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): ఖమ్మం లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసే యోచనలో సీపీఐ ఉన్నట్టు తెలిసింది. ఈ మేరకు ఇటీవలే తెలంగాణ, ఏపీలో ఒక్కో స్థానం నుంచి పోటీ చేయాలని రాష్ట్ర సమితి సమావేశంలో ఆ పార్టీ నిర్ణయించింది. ఈ ప్రతిపాదనను ఏఐసీసీ ముందు పెట్టి, ఖమ్మం సీటుపై కాంగ్రెస్ పార్టీని ఒప్పించాలనే యోచనలో సీపీఐ రాష్ట్ర నాయకత్వం ఉన్నది. ఖమ్మం సీటు ను కాంగ్రెస్ వదులుకునే అవకాశం ఉండదని, కచ్చితంగా ఆ స్థానం ఉంచి ఆ పార్టీ అభ్యర్థే పోటీ చేస్తారని కాంగ్రెస్ వర్గాలు ఇప్పటికే తేల్చి చెప్పాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో చివరి నిమిషం వరకు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవాలని భావించిన సీపీఎం అనూహ్య పరిణామాలతో 19 స్థానా ల్లో ఒంటరిగానే బరిలోకి దిగింది. ఒక్క స్థానంలో కూడా డిపాజిట్ దక్కించుకోలేకపోయింది. ఈ దశలో జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో సీపీ ఎం పోటీ చేస్తుందా? లేక మరో పార్టీకి మద్దతిస్తుందా అన్న చర్చ జరుగుతున్నది. బీజేపీకి వ్యతిరేకంగా గెలిచేవారికి మద్దతిస్తామని ఇప్పటికే ప్రకటించిన ఆ పార్టీ తెలంగాణలో మాత్రం ఎవరికి మద్దతిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది.