రంగారెడ్డి : తల్లిదండ్రులు లేరని బెంగ వద్దని, ఇకపై అలా అనుకోవద్దని ఈ రాష్ట్ర బిడ్డలుగా అనాథ పిల్లల సంరక్షణ బాధ్యత ప్రభుత్వమే చూస్తుందని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌లోని విక్టోరియా మెమోరియల్ హోంను మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి బుధవారం సందర్శించారు. పిల్లల యోగక్షేమాలపై ఆరా తీసిన మంత్రులు ఇంకా ఏం చేస్తే బాగుంటుందో చెప్పాల్సిందిగా అడిగారు. రాష్ట్రంలో అనాథలు, అనాథ ఆశ్రమాలు, కరోనా వల్ల తల్లిదండ్రులని కోల్పోయిన పిల్లల స్థితిగతులు మెరుగుకు, వారి భవిష్యత్‌కు బంగారు బాట వేసే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైన సంగతి తెలిసిందే.
విక్టోరియా మెమోరియల్ హోంను సందర్శించిన మంత్రులు అక్కడి వసతులను, పిల్లల ఆరోగ్య, విద్యా పరిస్థితులను పరిశీలించారు. హోంలో 58 మంది తల్లిదండ్రులు లేని పిల్లలు ఉన్నారు. మంత్రులు పిల్లలతో మాట్లాడి వారి బాగోగులు తెలుసుకున్నారు. ఇంకా ఏమేమి వసతులు కల్పిస్తే బాగుంటుంది, ఇంకా ఏమి చేస్తే సంతోషంగా ఉంటారో చెప్పాలని అడిగారు.
అనంతరం మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. పిల్లలు అనాథలు కాకుండా వీరిని రాష్ట్ర ప్రభుత్వ పిల్లలుగా గుర్తిస్తామన్నారు. ఈ పిల్లలందరికీ సీఎం కేసీఆర్ ప్రకటించే ప్యాకేజీ వారి బంగారు భవిష్యత్ తీర్చిదిద్దే విధంగా ఉంటుందన్నారు.
మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రాష్ట్రం వచ్చాక అనేక కార్యక్రమాలు చేశారు. ఏం చేసినా ఆ కార్యక్రమం లోతుల్లోకి వెళ్లి చేస్తారు. అందులో భాగంగానే అనాథల కోసం మంచి కార్యక్రమం చేయాలని నిర్ణయించారు. అనాథ పిల్లలకు అమ్మ, నాన్న ప్రభుత్వమే కావాలని సీఎం ఆలోచన. అనాథల కోసం దేశం మొత్తం గర్వించే విధంగా తెలంగాణలో నూతన విధానం తీసుకురానున్నారు. 120 ఏళ్ల కింద ఏర్పాటు అయిన ఈ విక్టోరియా మెమోరియల్ హోమ్ చాలా మందికి ఆశ్రయం ఇచ్చింది. ఇక్కడ కేజీ టు పీజీ వరకు విద్యావకాశం కావాలని అడిగారు. దీనిని సీఎం దృష్టికి తీసుకెళ్తాం. ఉమెన్ పాలిటెక్నిక్ కాలేజీ కూడా ఏర్పాటు చేసి అక్కడ చదువుకునే అవకాశం కల్పిస్తామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజన్, ఇతర అధికారులు, నేతలు పాల్గొన్నారు.