హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 2(నమస్తే తెలంగాణ): రైల్వేలో ఉద్యోగాలిప్పిస్తామంటూ నమ్మించిన ఒక ముఠా రూ.87 లక్ష లు వసూలు చేసి బాధితులను మోసగించింది. సీసీఎస్ పోలీసుల కథనం ప్రకారం.. తెలంగాణ సీఎంవోలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న బాగ్‌అంబర్‌పేట్‌కు చెందిన మధు కు దగ్గరి బంధువు ప్రశాంత్ ద్వారా కృష్ణానగర్‌లో నివాసముండే బండారు రామ్‌కుమార్‌తో పరిచయమైంది.
రైల్వేలో క్లర్కు, కమర్షియల్ క్లర్క్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ రామ్‌కుమార్ నమ్మించాడు. మధుతోపాటు బంధువులు ఉద్యోగాల కోసం రామ్‌కుమార్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు పలు దఫాలుగా 87లక్షలు అందజేశారు. క్లర్కు పోస్టులకు ఎంపికైనట్టు ఈమెయిల్, పోస్టు ద్వారా బాధితులకు అపాయింట్మెంట్ లెటర్లు పంపించారు. అవన్నీ నకిలీవంటూ రైల్వే అధికారులు తేల్చడంతో బాధితులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.