బెళగావి: ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తానంటూ పలు రాష్ర్టాలకు చెందిన విద్యార్థులను లక్షల రూపాయల మేర మోసగించిన అరగొండ అలియాస్ అరవింద అరగొండ ప్రకాశంను కర్ణాటకలోని బెళగావి సిటీ పోలీసులు అరెస్టు చేశారు. ప్రకాశంను హైదరాబాద్‌లోని గచ్చిబౌలికి చెందిన నివాసిగా పోలీసులు గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి రూ.12 లక్షల నగదు, ఐదు మొబైల్ ఫోన్లు, 12 మానిటర్లు, ఒక ల్యాప్‌టాప్ సీజ్ చేశారు. పెద్దమొత్తంలో డబ్బు ముట్టచెబితే.. ఎంబీబీఎస్ సీటు వచ్చేలా చేస్తానని ప్రకాశం పలు రాష్ర్టాలకు చెందిన విద్యార్థులకు హామీ ఇచ్చి మోసం చేసినట్టు తెలుస్తున్నది. ప్రకాశం 2023లో బెళగావి పట్టణంలో నీట్ గైడెన్స్ సెంటర్‌ను ప్రారంభించాడు. నీట్ తక్కువ స్కోర్ వచ్చిన అభ్యర్థులను టార్గెట్‌గా చేసుకొని, ఎంబీబీఎస్ సీట్లు వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చేవాడు. తన మోసాన్ని సులభతరం చేసుకొనేందుకు విద్యార్థులను ఆకర్షించేందుకు ప్రకాశం పలువురు స్థానిక యువతను నియమించుకొన్నాడు. బెల్గాంలోని కనీసం 10 మంది విద్యార్థులు ఈ మోసం బారిన పడ్డారని, ఒక్కొక్కరు కనీసంగా రూ.20 లక్షల చొప్పున చెల్లించారని పోలీసు వర్గాలు తెలిపాయి.
విద్యార్థిని ఫిర్యాదుతో వెలుగులోకి
ఈ విధంగా మోసపోయిన బీదర్‌కు చెందిన ఒక విద్యార్థిని గత ఏడాది నవంబర్‌లో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అరవింద అరగొండ ప్రకాశం ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. తర్వాత పోలీసుల దర్యాప్తులో విస్తుగొల్పే విషయాలు బయటకు వచ్చాయి. ప్రకాశం తప్పుడు గుర్తింపుతో చెలామణి అవుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ప్రత్యేక బృందాన్ని ఏర్పా టు చేసి, దర్యాప్తును ముమ్మరం చేయగా.. ప్రకాశం ముంబైలో ఉన్నట్టు గుర్తించారు. అనంతరం పోలీసులు అతన్ని బెళగావికి తీసుకొచ్చి కోర్టు ముందు ప్రవేశపెట్టారు.
తెలంగాణలో ఆరు కేసులు
ప్రకాశంపై తెలంగాణలో ఆరు కేసులు, మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఒకటి, బెంగళూరులో రెండు కేసులు నమోదయ్యాయి. డీసీపీ రోహన్ జగదీశ మాట్లాడుతూ దర్యాప్తు కొనసాగుతున్నదని, మోసపోయిన విద్యార్థులు, వారి కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ప్రకాశం మోసాల బారిన పడిన బాధితులు ముందుకు రావాలని, దర్యాప్తులో సహకరించాలని కోరారు.