హైదరాబాద్/కరీంనగర్, ఆగస్టు15 (నమస్తే తెలంగాణ): దళితబంధు పథకం ప్రారంభించి నేటితో రెండేండ్లు పూర్తయ్యాయి. ఈ రెండేండ్లలో దళితబంధు లబ్ధిదారుల జీవితాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. వివిధ వ్యాపారాలు చేసుకుంటూ, వాహనాలు నడుపుకుంటూ, పారిశ్రామికులుగా రాణిస్తూ ఒకప్పుడు ఇంకొకరిపై ఆధారపడి బతికిన దళితులు ఇప్పుడు ఇంకొకరికి ఉపాధి చూపే స్థాయికి చేరుకున్నారు. 2021 ఆగస్టు 4న వాసాలమర్రి వేదికగా ఈ పథకానికి శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్ అదే ఏడాది ఆగస్టు 16న రాష్ట్రవ్యాప్తంగా లాంఛనంగా ప్రారంభించారు. నేడు పలు కార్పొరేట్ కంపెనీలు దళితబంధు పథకం లబ్ధిదారుల ముందు బారులుతీరుతున్నాయి.
దళితబంధు పథకం మొదటి విడతలో భాగంగా హుజురాబాద్ నియోజకవర్గంతోపాటు యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి గ్రామం, చింతకాని, తిరుమలగిరి, చారగొండ, నిజాంసాగర్ మండలాలను పైలట్ ప్రాజెక్టుగా తీసుకుంది. ఆ తరువాత నియోజకవర్గానికి 100 దళిత కుటుంబాలకు పథకాన్ని విస్తరించింది. మొత్తంగా 38,323 దళిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో దళిత బంధుకు రూ.17,700 కోట్ల నిధులను కేటాయించిన ప్రభుత్వం రెండోవిడతను ప్రారంభించేందుకు సిద్ధమైంది. హుజురాబాద్ మినహా మిగిలిన 118 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 1100 కుటుంబాల చొప్పున 1,29,800 మందికి దళితబంధు పథకాన్ని వర్తింపజేయనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోటాలో మరో 200 దళిత కుటుంబాలకు కూడా పథకాన్ని అందించనున్నారు.
దళితబంధు పథకం విశిష్టతలను తెలుసుకుంటున్న కార్పొరేట్ కంపెనీలు లబ్ధిదారులకు తమ కంపెనీల ఫ్రాంచైజీలను అప్పగించేందుకు ముందుకువస్తున్నాయి. వాటిలో రెడ్ బకెట్, గ్రీన్ బకెట్ బిర్యానీ సెంటర్లు, అమెరికన్ టూరిస్టర్ బ్యాగ్స్ షాప్, మిఠాయివాలా, మిస్టర్ టీ, చాయ్‌వాలా, మద్రాస్ టీ, ప్రముఖ డయోగ్నోసిస్ సెంటర్లు, మెడ్‌ప్లస్, అపోలో తదితర ఫార్మా కంపెనీలు, ఎంఆర్ఎఫ్, టీవీఎస్ వంటి టైర్ల కంపెనీలు, అలెన్ సోలీ, ముఫ్తీ, యారో, లెవిస్, యూఎస్ పోలో వంటి క్లాత్ స్టోర్స్, మెక్‌డొనాల్డ్స్, మోచీ, ఉడ్‌లాండ్, షూమార్ట్, రీబాక్, నైకి, ఆడిడాస్, సుగుణ, వెంకీస్, వెన్‌కాబ్ వంటి పౌల్ట్రీ చికెన్ స్టోర్లు, క్రీమ్ స్టోన్, సాఫ్లీ పాయింట్, ఫోర్ సీసన్స్ ఐస్‌క్రీమ్ కంపెనీలు, హిందుస్థాన్, ఇండియన్, భారత్, రిలయన్స్, హెచ్‌పీ తదితర పెట్రోలియం కంపెనీలు, టైల్స్, శానిటరీ, ఒప్పో, వివో, సామ్సంగ్, ఎంఐ, వన్‌ప్లస్, బిగ్‌సీ వంటి మొబైల్ కంపెనీలు, ఏషియన్, జేఎస్‌డబ్ల్యూ, నెరోలాక్, టెక్నో వంటి పెయింట్ షాపులు, సోలార్ కంపెనీలతో పాటు తేనెటీగల పెంపకం, ఫిషరీస్, లైవ్‌స్టాక్, డెయిరీ తదితర వ్యవసాయానుబంధ రంగాలకు చెందిన ప్రముఖ పరిశ్రమలు కూడా ఆ జాబితాల ఉండటం విశేషం. లబ్ధిదారులకు తామే నైపుణ్య శిక్షణ అందిస్తామని కార్పొరేట్ కంపెనీలు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాయి.
ఒక్కో దళిత కుటుంబానికి రూ.10లక్షల చొప్పున ఆర్థిక చేయూతనందించి వారు తమకు నచ్చిన, వచ్చిన, నైపుణ్యత కలిగిన జీవనోపాధిని ఎంచుకునే స్వేచ్ఛను ప్రభుత్వం కల్పించింది. యూనిట్ల ఎంపికపై తుది నిర్ణయం లబ్ధిదారులదే. రెండో విడతలో కూడా ఇదే విధానాన్ని కొనసాగించనున్న ప్రభుత్వం లాభదాయక యూనిట్లపై అవగాహన కల్పించాలని నిర్ణయించింది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఇటుకల తయారీ, పేపర్ ప్లేట్స్ మాన్యుఫాక్చరింగ్, క్యాటరింగ్, ఇంజినీరింగ్ వర్క్స్, ఫర్నిచర్ తయారీ తదితర రంగాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయి. దళితబంధు పథకంపై ఆసక్తితో ముందుకువస్తున్న కార్పొరేట్ కంపెనీలను, లబ్ధిదారులను ఒకే వేదికపైకి చేర్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నది.
రెండో విడత దళితబంధు లబ్ధిదారులకు రెండు దఫాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఎంపికైన లబ్ధిదారులకు నియోజవకర్గాల వారీగా తొలుత అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నారు. లబ్ధిదారుడికి ఉన్న నైపుణ్యాలు ఏమిటీ? ఆసక్తి ఉన్న ఉపాధి రంగాలు ఏవీ? లబ్ధిదారుడు నివసరించే భౌగోళిక ప్రాంతంలో అందుబాటులో ఉన్న లాభదాయక ఆదాయ మార్గాలు ఏమిటి? అవకాశాలు ఏమున్నాయి? అనే అంశాలతోపాటు, కార్పొరేట్ కంపెనీలు, డిక్కీ, వీహాబ్ వంటి సంస్థలతో కూడా అవగాహన కల్పించనున్నారు. లబ్ధిదారులు యూనిట్లు ఏర్పాటు చేసుకున్న అనంతరం రెండోసారి శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా రెండు బృందాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒక్కో బృందంలో దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (డిక్కీ) నుంచి ఇద్దరు, ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఇద్దరు, జిల్లా కలెక్టర్‌తోపాటు, ఇద్దరు జిల్లా అధికారులతో శిక్షణను కొనసాగించాలని ప్రణాళికలు రూపొందించారు. శిక్షణకు సంబంధించిన మెటీరియల్‌ను కూడా సిద్ధం చేశారు. మొదటి విడత లబ్ధిదారుల విజయగాథలను కూడా శిక్షణ తరగతుల్లో పదర్శించాలని అధికారులు నిర్ణయించారు.
వాళ్లిద్దరూ ఆడపిల్లలు. తల్లిదండ్రులు లేని అనాథలైన అక్కాచెల్లెళ్లకు దళితబంధు పథకం దారిచూపింది. జీవితాలను నిలబెట్టింది. కూలీ చేసే సిద్ధంకి లలిత-రాజయ్యకు ఇద్దరు కూతుళ్లు సునీత, ఇందిర. సునీత ఎమ్మెస్సీ, బీఈడీ, ఇందిర డిగ్రీ పూర్తి చేశారు. కొద్దినెలల వ్యవధితో తల్లిదండ్రులిద్దరూ మృతి చెందారు. ఆస్తుల్లేవు, సొంతిల్లు కూడా లేదు. కిరాయి కట్టలేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అక్కాచెళ్లెల్లిద్దరిలో ఒకరు ప్రైవేట్ స్కూల్లో, మరొకరు కంగన్ హాల్లో పనికి కుదిరారు. ఇంతలో దళితబంధు స్కీం వచ్చింది. అక్క సునీత కంగన్హాల్లో అనుభవం ఉండడంతో లేడీస్ ఎంపోరియం యూనిట్‌కు దరఖాస్తు చేసుకుంది. నిరుడు యూనిట్ మంజూరైంది. జమ్మికుంట-వీణవంక ప్రధాన రోడ్డులో ఓ పోర్షన్ అద్దెకు తీసుకొని భగవతి లేడీస్ ఎంపోరియం అండ్ బ్యూటీ పార్లర్ ప్రారంభించింది. కొద్ది రోజుల్లోనే అనుకున్న దానికంటే ఎక్కువగా షాప్ రన్ అవుతున్నది. నెలకు రూ.50 వేలు సంపాదన వస్తున్నది. దీంతో సునీత మరో ముగ్గురు మహిళలను పనిలో కుదుర్చుకుంది. సక్సెస్ ఫుల్‌గా రన్ చేస్తున్నది.
అమ్మనాన్నలు చనిపోయాక ఇబ్బంది పడ్డం. ఎట్టా బతుకుడనుకున్నం. మా కోసమే కావచ్చు. దళితబంధు వచ్చింది. దరఖాస్తు చేసుకున్న. లేడీస్ ఎంపోరియం పెట్టుకున్న. ముగ్గురు అమ్మాయిలు పనిచేస్తున్నరు. వాళ్లకు జీతాలు రూ.20 వేలిస్తున్న. షాపు రూం కిరాయి రూ.17వేలు. అన్నీ ఖర్చులు పోను నెలకు రూ.50 వేల దాకా మిగుల్తున్నయ్. తలెత్తుకుని తిరుగుతున్నం. త్వరలోనే ఇల్లు కూడా కొనుక్కుంటం. దీనికి కారణం దళిత బంధే. కేసీఆర్ సార్‌కు మేం రుణపడి ఉంటం.
– సిద్ధంకి సునీత, దళిత బంధు లబ్ధిదారు (భగవతి లేడీస్ ఎంపోరియం-జమ్మికుంట)
దళితులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి గత పదేండ్లు దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (డిక్కీ) కృషి చేస్తున్నది. వివిధ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న దళితబంధు పథకంతో ఇప్పుడు గొప్ప అవకాశం వచ్చింది. ఇప్పుడు కంపెనీలే ముందుకు వచ్చి, దళితులకు తమ ఫ్రాంచైజీలను ఇచ్చేందుకు ఆసక్తితో ఎదురుచూస్తున్నాయి. ఇది గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని దళితబంధు లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి. పరిశ్రమల స్థాపనవైపు దృష్టి సారించాలి. ప్రభుత్వ ఆశయాన్ని, సీఎం కేసీఆర్ ఆశయాలను నెరవేర్చాలి.
– నర్రా రవికుమార్, డిక్కీ జాతీయ అధ్యక్షుడు