Milla Magee | హైదరాబాద్, మే 30(నమస్తే తెలంగాణ): చౌమహల్లా ప్యాలెస్‌లో జరిగిన విందులో మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీ పట్ల అతిగా ప్రవర్తించిన అతిథుల గుట్టు దొరికినట్టు తెలిసింది. కాంగ్రెస్ యువ నేతల ఆనవాళ్లను విచారణ కమిటీ గుర్తించినట్టు సమాచారం. వారిద్దరూ ముఖ్యనేతకు సన్నిహితులు గా ఉండటంతో వారి పేర్లు బయటికి పొక్కకుండా పెద్దలు అడ్డం పడుతున్నట్టు తెలిసింది. ఆ రోజు ఏమీ జరగలేదని ప్రభుత్వ పెద్దలు బుకాయిస్తున్నప్పటికీ, విందుకు అతిథులుగా వచ్చిన ఆ ఇద్దరు నేతలు మ్యాగీతో అనుచితంగా ప్రవర్తించినట్టు సీసీ టీవీ ఫుటేజీలో రికార్డయినట్టు తెలిసింది. మిస్ ఇంగ్లండ్ ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపడంతో రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు మహిళా ఐపీఎస్ అధికారులతో అంతర్గత విచారణకు ఆదేశించింది.
చౌమహల్లా ప్యాలెస్ విందులో మిస్ ఇంగ్లండ్ కూర్చున్న టేబుల్ వద్ద ఏం జరిగిందనే అంశంపైనే ప్రధానంగా దృష్టి సారించి మూడు రోజుల పాటు విచారించిన అధికారుల బృందం ఇద్దరు వ్యక్తులను అనుమానించినట్టు సమాచారం. సీసీ పుటేజ్‌లలో వారి వెకిలి చేష్టలను స్పష్టంగా గుర్తించినట్టు, అదే అంశాన్ని ప్రాథమిక నివేదికలో పొందుపరచి ప్రభుత్వానికి అందించినట్టు తెలిసింది. ఈ ఇద్దరు నేతలు కూడా 40 ఏండ్లలోపు వారేనని, వారిలో ఒకరు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న నేత కాగా, మరొకరు ముఖ్యనేత నిత్యం పేరుపెట్టి పిలిచేటంత సాన్నిహిత్యం ఉన్న కార్పొరేషన్ నేతగా విచారణ కమిటీ గుర్తించినట్టు ప్రచారం జరుగుతున్నది. చౌమహల్లా విందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌లు మొత్తం బయటపెడితేనే పూర్తి వివరాలు బయటకు వస్తాయని, కాబట్టి దానిని బయటపెట్టాలని మహిళా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం తరఫున మిస్ వరల్డ్ బాధ్యతలు నిర్వహిస్తున్న అత్యున్నతాధికారి మీడియాపై తన ఫ్రస్ట్రేషన్ ప్రదర్శించారు. సచివాలయం జర్నలిస్టులపై బూతులు ప్రయోగించారు. ఆయన నోటి దురుసుతనంపై మీడియా ప్రతినిధులు విస్మయం వ్యక్తంచేశారు. మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీ ఆరోపణల నేపథ్యంలో వేసిన విచారణ కమిటీ ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించినట్టు బయటికి వచ్చింది. దీంతో మీడియా ప్రతినిధులు సదరు ఉన్నతాధికారి నుంచి వివరణ కోరే ప్రయత్నం చేయగా.. ఆయన దుర్భాషలకు దిగడంతో జర్నలిస్టులు ఆందోళన వ్యక్తంచేశారు.