HCU Students | హైదరాబాద్ సిటీ బ్యూరో, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): అరుదైన మొక్కల పెరుగుదల, వన్యప్రాణుల మనుగడకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధి భూములు ఎంతో అనువైనవని తేలింది. యూనివర్సిటీలోని ప్రొఫెసర్ ఎస్ సిద్ధార్థన్ ఆధ్వర్యంలో ప్లాంట్ సైన్స్ ప్రొఫెసర్లు, ఎకాలజీ రిసెర్చ్ ప్రొఫెసర్, ఎకాలజీ స్కాలర్స్, 30 మంది ప్లాంట్ సైన్స్ స్కాలర్స్ యూనివర్సిటీలోని సౌత్ క్యాంపస్ అటవీ ప్రాంతంలో సర్వే చేశారు. ఈ సర్వేలో గ్రేటర్ హైదరాబాద్‌లోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే హెచ్‌సీయూ భూములు ప్రత్యేకమైనవని స్పష్టమైంది. అరుదైన అటవీ వృక్షాల మనుగడకు ఈ భూములు అనుకూలమైనవని వెల్లడైంది. అక్కడ అడవే లేదు.. జం తువులే లేవు.. జీవవైవిధ్యం లేదంటున్న సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న వ్యా ఖ్యలు ఉత్త మాటలేనని తేటతెల్లమైంది.
సర్వే బృందం సౌత్ క్యాంపస్‌లోని 10 ప్రాంతాలను ఎంచుకొని అక్కడి మొక్కలు, వాటి ఎగుదల, లక్షణాలపై అధ్యయనం చేసింది. ఒక్కో ప్రాం తంలో 10 చదరపు మీటర్ల ప్రాంతాన్ని ఎంపిక చేసి అక్కడి చెట్ల ఎత్తు, వెడల్పును లెక్కించారు. అక్కడున్న ఒక్కో చెట్టు దాదాపు 33 సెంటీమీటర్ల వెడల్పు కలిగి ఉన్నట్టు గుర్తించారు. ఈ చెట్లు వాల్టా, అటవీ పరిరక్షణ చట్టాలకు అనుగుణంగా ఉన్నట్టు తేలింది. చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో మొత్తం 26 జాతుల చెట్లున్నట్టు గుర్తించారు. మరో 11 గుర్తించని జాతులూ ఉన్నాయని తేలింది. ఇలా వెయ్యి చదరపు మిల్లీ మీటర్ల విస్తీర్ణంలోనే 195 చెట్లున్నాయి. ఈ అంచనా ప్రకారం 100 ఎకరాల్లో దాదాపు 78,914 చెట్లున్నాయి. వీటన్నిటి యావరేజీ వెడల్పు 32 సెంటీమీటర్లుగా ఉన్నది.
సర్వే బందం పరిశోధనలో హెచ్‌సీయూ పరిధిలోని భూముల్లో ఉన్న చెట్లన్నీ అటవీ జాతులకు చెందినవేనని తేలింది. తెలంగాణలోని అడవులన్నీ దక్కన్ అడవులనేనని.. రాష్ట్రంలోని అడవుల్లో ఎత్తైన చెట్లు ఉండేవని సర్వే బృందం సభ్యులు చెప్తున్నారు. హెచ్‌సీయూలోని చెట్లు కూడా చాలా ఎత్తులో ఉన్నాయని తేల్చారు. ఇక్కడ పెరిగే చెట్లలో చాలా వరకు ఔషధ మొక్కలేనని చెప్పారు. ఈ భూములు అన్ని రకాల జీవ జాతుల మనుగడకు అనుకూలంగా ఉంటుందని వెల్లడించారు. అందుకే ఇక్కడ జింకలు, నెమళ్లు, నక్షత్ర తాబేళ్లు, వందలాది రకాల పక్షులు జీవిస్తున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి జీవవైవిధ్యం కలిగిన ప్రాంతాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని స్పష్టంచేశారు.
వర్సిటీ పరిధిలోని సౌత్ క్యాంపస్ ప్రాంతంలో ఉన్న జీవవైవిధ్యం ఈస్ట్ క్యాంపస్ ప్రాంతానికి చెందిన 400 ఎకరాల్లోనూ ఉన్నదని సర్వే బృందం సభ్యులు తెలిపారు. ఆ భూముల్లో కూడా అటవీ సంపద ఉన్నదని పేర్కొన్నారు. ప్రభుత్వం, పోలీసులు అనుమతిస్తే చెట్లు నరికిన 400 ఎకరాల్లో కూడా సర్వే చేస్తామని, అక్కడా వందలాది జాతుల మొక్కలు, అటవీ మొక్కల ఆనవాళ్లను నిరూపిస్తామని అంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఆ భూములను పరిరక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
హెచ్‌సీయూ పరిధిలోని 400 ఎకరాల్లో అడవి లేదు, జీవవైవిధ్యం లేదని ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తున్నది. యూనివర్సిటీలోని ప్లాంట్ సైన్స్, ఎకాలజీ విభాగాల ఆధ్వర్యంలో చేపట్టిన సర్వేలో హెచ్‌సీయూ పరిధిలోని భూములు విలువైన జీవవైవిధ్యానికి కేంద్రమని స్పష్టమైంది. ప్రభుత్వం మాకు అవకాశమిస్తే 400 ఎకరాల్లో సర్వే చేసి అక్కడ అటవీ మొక్కలు ఉన్నట్టు నిరూపిస్తాం. ఇప్పటికైనా అసత్య ప్రచారాలు మానేసి ఆ భూములను పరిరక్షించాలి. హైదరాబాద్‌కు ఆక్సిజన్‌ను అందించే దట్టమైన అటవీ సందపను కాపాడి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకోవాలి.
– సాకె ప్రవీణ్, ప్లాంట్ సైన్స్ రిసెర్చ్ స్కాలర్, హెచ్‌సీయూ