వేములవాడ/వేములవాడ టౌన్, జూలై 12: దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆలయ అర్చకులపై కత్తిగట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల బదిలీల్లో భాగంగా ఆలయ అర్చకులనూ బదిలీ చేయాలని నిర్ణయించింది. ఎండోమెం ట్ యాక్ట్ ప్రకారం ఆలయాల్లో పనిచేసే అర్చకులు సదరు ఆలయ విశిష్ఠత సంప్రదాయాలకు అనుగుణంగా పూజలు నిర్వహించాల్సి ఉండటంతో బదిలీ చేయరాదనే నిబంధన ఉన్నా ఏ మాత్రం లెక్కచేయకుండా ముందుకుసాగుతున్నది. ఇది సరైన పద్ధతి కాదని, నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తున్నది.
బదిలీలు చట్ట విరుద్ధం
దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఎండోమెం ట్ యాక్ట్ 87, సెక్షన్ 142 ప్రకారం ఆలయాల్లో పనిచేసే అర్చకులను బదిలీ చేయరాదనే నిబంధన ఉన్నది. ఎకడికకడ ఆలయా ల్లో ఉన్న విశిష్ఠత సంప్రదాయాలకు అనుగుణంగా పూజలు నిర్వహించాల్సి ఉన్నందున అదే ఆలయంలో పనిచేయాలని చట్టంలో ఉన్నది. బదిలీలకు నిబంధనలు అడ్డువస్తాయని భావిస్తున్న అధికారులు, అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వకుండా మౌఖిక ఆదేశాలతో పూజారుల్లోనూ 40 శాతం బదిలీల వ్యవహా రం తెరమీదికి తేవడం కలకలం రేపుతున్నది. బలవంతంగా బదిలీల కోసం ఆప్షన్లు అడుగుతుండటంతో కలవరపడుతున్నారు. అర్చకుల విధుల్లో ఏదైనా తప్పిదాలు జరిగితే ఎక్కడికక్కడే చర్యలు తీసుకోవాలి. కానీ, ఇతర దేవాలయాలకు బదిలీ చేయడం ద్వారా నిబంధనలకు తిలోదకాలు ఇచ్చినట్టే అవుతుందని అర్చక సంఘాలు తప్పుపడుతున్నాయి.
ఒక్కో ఆలయంలో ఒక్కో విధంగా పూజలు
రాష్ట్రంలోని ఒక్కో ఆలయానికి ఒక్కో విశిష్టత ఉన్నది. అక్కడి సంపద్రాయం ప్రకారం అర్చకులు ప్రత్యేక పూజలు చేస్తుంటారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పాంచారాత్రా ఆగమం, భద్రాచలం సీతారాములస్వామి వారి ఆలయంలో పాం చారాత్రాఆగమం, కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో చాత్తాద వైష్ణవం, బాసర సరస్వతీ దేవి ఆలయంలో స్మార్త సంప్రదా యం, కొమురవెల్లి మల్లికార్జున ఆలయంలో వీరశైవ గొల్ల, కురుమ వ్యవస్థ ద్వారా పూజలు జరుగుతుంటాయి. వేములవాడ రాజన్న ఆలయంలో స్వామివారికి సుప్రభాతం మొదలుకొని ఏకాంత సేవ వరకు విశేష పూజలు, ఉత్సవాలు జరుగుతుంటాయి. మాసశివరాత్రి రోజు 3 గంటలు మహా లింగార్చన, శుక్ర, సోమవారం ప్రత్యేక కీర్తనలతో ఏకాంత సేవ ఉంటుంది.ప్రాతఃకాల పూజ పౌరాణిక స్తోత్రా లు, వైదిక విధానంతో కూడిన ప్రదోష పూజ, నిషి పూజ మొదలైన విధానాలు ఉంటాయి. ఈ పూజా విధానాలు దేవాదాయ శాఖ వారు నిర్వహించే ఆగమ పరీక్షల సిలబస్లో కనిపించదు. ఇక రాజరాజేశ్వరి అమ్మవారికి ప్రతి శుక్రవారం చతుష్షష్టి ఉపచార పూజ రెండువేళలా విశేషంగా జరుగుతుంది. రాజన్న క్షేత్రం హరిహర క్షేత్రంగా పిలవబడుతుంది. ఇకడ స్వామివారితోపాటు సీతారామచంద్రస్వామి, లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి వారికి పునర్వసు, రేవతి నక్షత్రములందు పంచోపనిషత్ ద్వారా మహాభిషేకం పూజలు నిర్వహిస్తారు. శివకల్యా ణం పాంచాహ్నిక ధ్వజారోహణ విధానంలో, రామ కల్యాణం ప్రత్యేకమైన విధానంతో నిర్వహిస్తారు. అన్న పూజ, ఆకు పూజలు చేపడతారు. ఈ పూజా విధానాలు సిలబస్ రూపంలో ఎక్కడా ఉండవు.
వేములవాడలోని కైంకర్యాలు ఎకడా ఉండవు
ఏ ఆలయమైనా ఆ గుడి సంప్రదాయాలు, ఆ ప్రాంత విశిష్టతలకు అనుగుణంగా ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. ఇది వేల సంవత్సరాల తరబడిగా వస్తున్న ఆనవాయితీ. అలా పూజలు చేసే అర్చకులను మరో ప్రాంతానికి బదిలీ చేయడం అనేది సరైన పద్ధతి కాదు. అలా చేయడం కూడా ఆలయ సంప్రదాయాలకు తిలోదకాలిచ్చినట్టే. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయంలో నిర్వహించే కైంకర్యాలు దేశంలోనే ఎకడా ఉండవు.
– గోపన్నగారి శంకరయ్య, రిటైర్డ్ స్థానాచార్యులు, రాజన్న ఆలయం, వేములవాడ
ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
అర్చక బదిలీలు ధర్మ విరుద్ధం. దేవాదాయ శాఖ చట్టంలోనే అర్చక బదిలీలపై నిబంధన ఉన్నది. ఏ క్షేత్రానికి అనుగుణంగా అక్కడి సంప్రదాయాన్ని అనుసరించిన పూజా విధానాలు ఉంటాయి. బదిలీలతో వాటి విశిష్ఠతను కోల్పేయే ప్రమాదం ఉన్నది. అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకుండా మౌఖిక ఆదేశాలతో అర్చక ఉద్యోగులను బలవంతంగా ఆప్షన్లు అధికారులు అడుగుతున్నారు. అర్చక బదిలీల ప్రక్రియను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. రాజన్న దేవాలయంలో ఖాళీగా ఉన్న అర్చకుల పోస్టులను భర్తీ చేయకుండా బదిలీ చేయడాన్ని తప్పుపడుతున్నాం. బదిలీలు కొనసాగితే వేములవాడ అనువంశిక అర్చక సంఘం తరఫున ఆందోళనకు దిగుతాం.
– ప్రతాప రామకృష్ణ, అనువంశిక అర్చక సంఘం అధ్యక్షులు, వేములవాడ