హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : తెలుగు రాష్ర్టాలను వర్షాలు ఇప్పట్లో వదిలేలా లేవు. ఇప్పటికే ఈ సీజన్లో బంగాళాఖాతంలో అనేక అల్పపీడనాలు ఏర్పడగా.. బుధవారం మరొకటి ఏర్పడే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD Hyderabad) తెలిపింది. గురువారం నాటికి పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా (Cyclone) బలపడే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నది. 3వ తేదీ నాటికి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలపై వాయుగుండం తీరం దాటే అవకాశం ఉన్నదని చెప్పింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో నాలుగు రోజులపాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది.
ఆదిలాబాద్, కుమ్రంభీంఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్భూపాలపల్లి, ములుగు, భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రిభువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశమున్నదని వెల్లడించింది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసినట్టు అధికారులు తెలిపారు. దేశంలో రుతుపవన కాలం ముగిసింది. ఈ సీజన్లో సాధారణం కన్నా 8 శాతం అధిక వర్షపాతం నమోదైనట్టు భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మొహాపాత్ర తెలిపారు. రుతుపన కాలం మంగళవారంతో ముగిసినప్పటికీ, ఇకపైనా దేశవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. వాయువ్యంలోని కొన్ని ప్రాంతాలు మినహా, దేశంలోని చాలా ప్రాంతాల్లో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు సాధారణం కంటే ఎకువ వర్షాలు కురుస్తాయి. అక్టోబర్లో సాధారణం కంటే 15 శాతం ఎకువ వర్షపాతం ఉంటుందని వివరించారు.