జ్యోతినగర్, నవంబర్ 13: రామగుండం కేంద్రంగా దక్షిణాది రాష్ర్టాలకు వెలుగు పంచుతున్న కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ వెలుగుల దివ్వె ఎన్టీపీసీ ఆవిర్భవించి నేటికి 44 ఏండ్లు. 1978 నవంబర్ 14న అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయి శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి బొగ్గు ఆధారిత విద్యుత్తు రంగంలో ఎదుగుతూవస్తున్నది. క్రమక్రమంగా ఉత్పత్తి పెంచుకుటూ ప్రస్తుతం 2,600 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేస్తూ వెలుగులను పంచుతున్నది.
దేశంలోనే ప్రథమంగా ఐఎస్వో 14001 సర్టిఫికెట్ పొందిన ప్రాజెక్టుగా నిలిచింది. ఆ తర్వాతి నుంచి రామగుండం ఎన్టీపీసీ 10 మెగావాట్ల సౌరశక్తి ప్లాంటు, 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సౌరశక్తి ప్లాంటు విస్తరణతో వెలుగులను అందిస్తున్నది. కొత్తగా మరో 1,600 మెగావాట్ల తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటున్నది. దేశవ్యాప్తంగా ఆయా పాజెక్టుల్లో 70,254 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంలో మమేకమైన రామగుండం ఎన్టీపీసీ నిర్దేశించిన విద్యుత్తు ఉత్పత్తి లక్ష్యం దిశగా ముందుకు సాగుతున్నది. సామాజిక సేవలో భాగంగా ప్రాజెక్టు ప్రభావిత గ్రామాలకు అండగా నిలుస్తున్నది.
ప్లాంటులో విడుతల వారీగా మొత్తం ఏడు యూనిట్లు నిర్మించారు. స్టేజీ-1 కింద 200 మెగావాట్ల చొప్పున 3 యూనిట్లలో 600 మెగావాట్లు, స్టేజీ-2 కింద 500 మెగావాట్ల చొప్పున 3 యూనిట్లలో 1,500 మెగావాట్లు, స్టేజీ-3 కిం ద మరో 500 మెగావాట్ల యూనిట్ నిర్మించా రు. ఇలా మొత్తం ఏడు యూనిట్లతో 2,600 మెగావాట్ల సామర్థ్యానికి పవర్‌ప్లాంటు విస్తరించింది. స్థానిక సింగరేణి బొగ్గు గనుల నుంచి రోజుకు 32 వేల మెట్రిక్ టన్నుల కోల్ లింకేజీ, ఒడిశాలోని మహానది కోల్‌ఫీల్డ్స్ నుంచి 8 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు లింకేజి ఒప్పందంతో ప్రాజెక్టుకు నిత్యం బొగ్గు దిగుమతి అవుతున్నది. అలాగే, ప్రాజెక్టుకు నీటి అవసరం 6.5 టీఎంసీలను ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఎన్టీపీసీ రిజర్వాయర్‌కు సరఫరా చేస్తున్నారు. కాగా, 800 మెగావాట్ల చొప్పున (1,600 మెగావాట్లు) రెండు యూనిట్ల నిర్మాణ పనులు తుది దశకు చేరాయి.