హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి యూనియన్ రద్దు వెనుక కుట్ర దాగి ఉన్నట్టు తేటతెల్లమైంది. నిబంధనలను ఉల్లంఘిస్తూ ఏడాది గడువు ముగియక ముందే ఎలక్టెడ్ బాడీ అయిన యూనియన్ రద్దు నిర్ణయానికి ముందుగానే ఉన్నతాధికారులు ఉద్దేశపూర్వకంగా ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నది.
ఇదంతా కావాలనే ప్లాన్ ప్రకారం చేశారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. రద్దు నిర్ణయం, ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు నిర్ణయం ఒకేరోజు తీసుకున్నా.. ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్టు ఒకరోజు ముందుగానే ఎలా ప్రకటిస్తారని ప్రశ్నిస్తున్నారు. వీసీ, రిజిస్ట్రార్, విద్యార్థి సంక్షేమ డీన్‌కు ప్రస్తుతం ఉన్న స్టూడెంట్ యూనియన్ పూర్తిస్థాయిలో కొనసాగడం ఇష్టం లేకే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహిస్తున్నారని ఆరోపిస్తున్నారు.