హైదరాబాద్, ఆగస్టు 3(నమస్తే తెలంగాణ) : టీ-హబ్… హైదరాబాద్ ఐటీ రంగానికి ఐకాన్. ఈ వేదికగా ఎంతోమంది యువ పారిశ్రామికవేత్తలు తమ సొంత ఆలోచనలతో వందల సంఖ్యలో స్టార్టప్‌లకు పురుడుపోశారు. తద్వారా స్టార్టప్‌ల రంగంలో హైదరాబాద్‌ను దేశంలోనే అగ్రగామిగా నిలిపింది. పారిశ్రామిక, ఐటీ దిగ్గజాలు రతన్ టాటా, సత్య నాదేళ్ల, ఆనంద్ మహీంద్ర వంటి అనేకమంది టీ-హబ్‌ను సందర్శించి ప్రశంసలు కురిపించారు. ఇంతటి ప్రఖ్యాతిగాంచిన స్టార్టప్‌ల అడ్డా టీ-హబ్‌లో ఆధ్యాత్మికవేత్త ముక్తిగురు శ్రీ కృష్ణజీ కార్యక్రమానికి అనుమతి ఇవ్వడంపై విమర్శలొస్తున్నాయి. ‘ఈ వృద్ధి రహస్యాన్ని తెలుసుకోండి’ అంటూ వన్నెస్ పేరిట సోమవారం ఉదయం 10.30 గంటలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై ఐటీ నిపుణులు నివ్వెరపోతున్నారు. సాంకేతిక యుగానికి వారధిగా నిలిచిన టీ-హబ్‌లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడంపై మండిపడుతున్నారు. యువతను భజనలు, కీర్తనల వైపు మళ్లిస్తుందా? అని విమర్శిస్తున్నారు.
రేవంత్‌రెడ్డి సర్కారు పాలన కక్ష రాజకీయాలకు పెట్టింది పేరనే విమర్శలున్నాయి. ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ ఆనవాళ్లను తొలగిస్తానంటూ సీఎం రేవంత్‌రెడ్డి శపథం చేశారు. ఇప్పుడు కేటీఆర్ పేరును సైతం హైదరాబాద్ ఐటీ రంగం నుంచి తొలగించే కుట్రలకు సర్కారు తెరతీసిందనే విమర్శలొస్తున్నాయి. వాస్తవానికి హైదరాబాద్ ఐటీ అభివృద్ధిలో కేటీఆర్ పాత్ర ఎనలేనిది. 2014లో రూ.57 వేల కోట్లుగా ఉన్న రాష్ట్ర ఐటీ ఎగుమతులు 2023లో ఏకంగా రూ.2.41 లక్షల కోట్లకు పెరిగాయి. ఈ స్థాయిలో పెరుగుదల అద్భుతమంటూ ఐటీ నిపుణులు కొనియాడిన సందర్భాలున్నాయి. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ ఐటీరంగం నుంచి కేటీఆర్ పేరును తొలగించే కుట్రకు కాంగ్రెస్ సర్కారు తెరతీసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేటీఆర్ ఆలోచనలతో పురుడు పోసుకున్న టీ-హబ్‌ను నిర్వీ ర్యం చేసే దిశగా కాంగ్రెస్ సర్కారు అడుగులు వేస్తున్నదనే విమర్శలున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీ-హబ్‌లో కార్యక్రమాలను తగ్గించిందనే ఆరోపణలున్నాయి. స్టార్టప్‌ల రూపకల్పనలో యువతకు ప్రోత్సాహం అందించడం లేదనే విమర్శలున్నాయి. ఈవిధంగా నెమ్మదిగా టీ-హబ్‌ను ఏర్పాటు చేసిన ఉద్దేశం నుంచి పక్కకు తప్పించాలని భావిస్తున్నట్టు తెలిసింది. దీనికితోడు స్టార్టప్‌లకు ప్రోత్సాహం అందించే దిశగా కార్యక్రమాలను నిర్వహించాల్సిన చోట వాటిని నిలిపేసి ఇతర కార్యక్రమాలను నిర్వహించాలని ప్రణాళిక రూపొందించినట్టు తెలిసింది.
ఆలోచనలు చాలామందిలో ఉంటాయి కానీ, వెన్నుతట్టి వారిని ప్రోత్సహించి ఆ ఆలోచన కార్యరూపం దాల్చేలా చేయడమే టీ-హబ్ ప్రత్యేకత. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఔత్సాహిక ఐటీ యువతకు తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో నాటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ 2015లో టీ-హబ్‌ను ఏర్పాటు చేశారు. దీనిద్వారా అద్భుతమైన ఫలితాలు రావడంతో టీ-హబ్ 2.0ను సైతం 2022లో ప్రారంభించారు. టీ-హబ్ ద్వారా సుమారు 3,500కుపైగా స్టార్టప్‌లు రూపుదిద్దుకోవడం గమనార్హం. తద్వారా రూ.వేల కోట్ల ఫండింగ్‌ను సృష్టించాయి. ఒకవిధంగా చెప్పాలంటే స్టార్టప్ రంగంలో టీ-హబ్ ఐకాన్‌గా నిలిచింది. దీని గురించి తెలుసుకున్న రతన్ టాటా, సత్య నాదెళ్ల, ఆనంద్ మహీంద్రతోపాటు ఎంతోమంది దిగ్గజాలు టీ-హబ్‌ను సందర్శించి ప్రశంసించారు.
ఐటీ నిపుణులు సర్కారు నిర్ణయంపై తీవ్ర ఆసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సాంకేతిక కేంద్రాలను, ఐటీ అడ్డాలను ఆధ్యాత్మిక కేంద్రాలుగా మార్చాలనుకుంటున్నదా? అని మండిపడుతున్నారు. ఐటీ ఉద్యోగులకు ఆధ్యాత్మికత అందించాలంటే అందుకు వేరే వేదికలను చూసుకోవాలని, కానీ ఐటీ అడ్డాగా ఉండే చోట నిర్వహించడం ఏమిటని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ సర్కారు పాలనలో హైదరాబాద్ ఐటీ రంగం డీలా పడుతున్నదనే విమర్శలున్నాయి. ఏడాది క్రితం వరకు హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు పోటీపడ్డ ఐటీ కంపెనీలు కాంగ్రెస్ పాలనతో ఇటువైపు కూడా చూడటం లేదనే విమర్శలున్నాయి. ఈ విధంగా హైదరాబాద్ ఐటీ రంగానికి చేతనైన చెడ్డపేరు తెస్తున్న రేవంత్ సర్కారు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అనుమతిచ్చి తన క్షక్షసాధింపుకు పాల్పడుతుందని విమర్శలొస్తున్నాయి.