హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): సమయంతో సంబంధం లేకుండా నిత్యం పనిలో నిమగ్నమయ్యే ఐటీ ఉద్యోగులకు అనారోగ్య సమస్యలు పొంచి ఉన్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. జీవనశైలి కారణంగా టెకీలు నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ బారినపడుతున్నారని పరిశోధకులు గుర్తించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సంస్థ పరిశోధకులు ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. సగటున 30 ఏండ్ల వయసున్న ఐటీ ఉద్యోగులపై దృష్టి సారించిన అధ్యయనం ఫలితాలు 2023 ఆగస్టులో అంతర్జాతీయ జర్నల్ ‘న్యూట్రియంట్స్’లో ప్రచురితమయ్యాయి. అధ్యయనంలో పాల్గొన్న ఐటీ ఉద్యోగుల్లో దాదాపు 46 శాతం మంది మూడు లేదా అంతకంటే ఎక్కువ వ్యాధులతో బాధపడుతున్నట్టు తేలింది.
ఎక్కువ మందిలో మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. వారిలో ట్రైగ్లిజరైడ్, లిపోప్రోటీన్ అధికంగా ఉన్నట్టు వెల్లడైంది. ఉద్యోగులు సాధారణ పనిదినం సమయంలో సగటున 8 గంటలకు పైగా కూర్చొని గడుపుతున్నారని అధ్యయనం ప్రధానంగా గుర్తించింది. 22 శాతం మంది ఉద్యోగులు మాత్రమే వారానికి కనీసం 150 నిమిషాలపాటు సిఫార్సు చేసిన శారీరక శ్రమను కలిగి ఉన్నట్టు వెల్లడైంది. ఎక్కువ మంది ఉద్యోగుల ఆహారపు అలవాట్లను సైతం నివేదిక ఎత్తి చూపింది. దేశ ప్రగతికి విశేషంగా దోహదపడుతున్న ఐటీ రంగ ఉద్యోగుల ఆరోగ్యం, సంక్షేమం ఆందోళనకరంగా మారిందని ఎన్ఐఎన్ డైరెక్టర్ హేమలత ఆర్ పేర్కొన్నారు.