చేర్యాల, మే 27 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఏసీబీ నోటీసులు జారీ చేయడం కక్షసాధింపు చర్యలు మాత్రమేనని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాలలో జరిగిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే పల్లా మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నాయకులపై కక్ష సాధింపులు చేయడం తప్పితే ప్రజలకు చేసింది ఏమీలేదని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో స్పోర్ట్స్, గేమ్స్, ఈ కార్స్ రేసింగ్ వల్ల అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్‌కు మంచి గుర్తింపు, వేలాది రూ. కోట్ల పెట్టుబడులు వచ్చాయని గుర్తుచేశారు. కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేక డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నట్టు ధ్వజమెత్తారు.