వరంగల్ చౌరస్తా, ఏప్రిల్ 27 : పీజీ వైద్య విద్య కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ తుది మాప్ అప్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటివరకు నాలుగు విడతల కౌన్సెలింగ్ పూర్తయ్యిందని యూనివర్సిటీ అధికారులు తెలియజేశారు. ఇప్పటికీ ఖాళీగా ఉన్న కన్వీనర్ కోటా సీట్లను ఈ తాజా నోటిఫికేషన్ ఆధారంగా భర్తీ చేయనున్నట్లు తెలిపారు. తుది మెరిట్ జాబితాలో అర్హులైన అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ నెల 27వ తేదీ సాయంత్రం 4గంటల నుంచి 28వ తేదీ మధ్యాహ్నం 2గంటల వరకు ప్రాధాన్యతా క్రమంలో కళాశాలల వారీగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోచ్చని తెలిపారు.
గత విడుత కౌన్సెలింగ్‌లలో సీట్ అలాట్ అయి కళాశాలలో అడ్మిషన్ తీసుకోకపోయినా, అడ్మిషన్ తీసుకొని వదిలివేసిన అభ్యర్థులు, అఖిల భారత కోటాలో ఇప్పటికే సీటు పొందిన అభ్యర్థులు ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అనర్హులని యూనివర్సిటీ పేర్కొన్నది. ప్రస్తుతం కాళోజీ యూనివర్సిటీ, ఆలిండియా కోటా రెండింటి పరిధిలో ఏ సీటూ లేని అభ్యర్థులకు ఒకసారి మినహాయింపుగా వారిని కౌన్సెలింగ్‌కు అర్హులుగా ప్రకటించడం జరిగింది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆల్ ఇండియా మాప్ అప్ విడత కౌన్సెలింగ్ రద్దు చేసిన కారణంగా ఆలిండియా కోటా మాప్ అప్ విడత కౌన్సెలింగ్‌లో సీటు పొంది రాష్ట్ర కౌన్సెలింగ్‌లో పొందిన సీటును వదులుకున్న అభ్యర్థులకు రాష్ట్ర కౌన్సెలింగ్‌లో పాల్గొనడానికి అవకాశాన్ని యూనివర్సిటీ కల్పిస్తున్నట్లు తెలియజేశారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్ సైట్ www.knruhs.telangana.gov.in లో చూడొచ్చని యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి.