హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): ఆర్టీఏ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీకి ఏజెంట్ల వ్యవస్థ లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐని వినియోగించాలని రాష్ట్ర రవాణాశాఖ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. రాష్ట్రంలోని 62 ఆర్టీవో కార్యాలయాలు ఏటా సుమారు 36 లక్షల వాహనాల రిజిస్ట్రేషన్ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్‌లు జారీ చేస్తున్నాయి. వీటిలో ఎక్కువ శాతం ఏజెంట్ల ద్వారానే జారీ అవుతున్నాయి. దీంతో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి.
రాష్ట్రంలోని పలు రవాణాశాఖ కార్యాలయాలపై ఇటీవల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. 30 ప్రాంతాల్లో ఏసీబీ తనిఖీలు చేయగా ఏజెంట్ల వద్ద భారీగా వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, డ్రైవింగ్ లైసెన్స్‌లు దొరికాయి. హైదరాబాద్‌లోని ఓ ఆర్టీవో కార్యాలయంలో తనిఖీలు చేయగా 13 మంది ఏజెంట్ల దగ్గర వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, డ్రైవింగ్ లైసెన్సులు లభించాయి. ఓ ఏజెంటు దగ్గర ఏకంగా 250 ఆర్సీలు, లైసెన్స్‌లు దొరకడం అధికారులను విస్మయానికి గురిచేసింది. కొంతకాలంగా చాలామంది ఆర్టీఏ అధికారులు ఏసీబీకి పట్టుబడ్డారు.
మహారాష్ట్రలో మాదిరిగా కేంద్రీకృత విధానంలో కేంద్ర కార్యాలయం నుంచే వివిధ కార్డులు నేరుగా వినియోగదారుల ఇండ్లకు పంపించి, అవినీతికి ఆసారం లేకుండా చేయాలని రాష్ట్ర రవాణాశాఖ రెండు నెలల క్రితం నిర్ణయం తీసుకున్నది. కానీ ఆచరణకు నోచుకోలేదు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా డ్రైవింగ్‌లో నైపుణ్యం, సరైన ధ్రువపత్రాలు లేనివాళ్లు కూడా ఏజెంట్లను ఆశ్రయిస్తున్నారు. సాధారణంగా వాహనం కొనుగోలు సమయంలోనే డీలర్లు లైఫ్‌టైమ్ రిజిస్ట్రేషన్ ట్యాక్స్ వసూలు చేస్తారు. అనంతరం ఏజెంట్ల ద్వారా ఆ ట్యాక్స్‌ను ఆర్టీవోకు పంపుతారు. అధికారులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి, ఆ పత్రాలను నేరుగా వాహన యజమానికి ఇవ్వకుండా కిందిస్థాయి ఉద్యోగుల ద్వారా దళారుల చేతుల్లో పెట్టి, వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఉన్నతాధికారులు గుర్తించారు.
ఈ అవినీతిని నియంత్రించేందుకు కేంద్రం రహదారి భద్రత చట్టంలో భాగంగా 2016లో పలు మార్గదర్శకాలను జారీచేసింది. వాహనాలు షోరూంలోనే శాశ్వత రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. కానీ, అది ఏ మాత్రం అమలుకు నోచుకోవడంలేదు. ఈ నేపథ్యంలో ఆర్టీఏ కార్యాలయాల్లో ఏజెంట్ల వ్యవస్థను రూపుమాపి, అవినీతికి అడ్డుకట్ట వేయాలని రవాణాశాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం వాహనదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్‌లను ఏఐ టెక్నాటజీ ద్వారా పారదర్శకంగా అందించాలని నిర్ణయించినట్టు సమాచారం.