హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తేతెలంగాణ): హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో మంగళవారం నుంచి ఐదు రోజుల పాటు ‘స్పేస్టూన్’ పేరిట స్పేస్ థీమ్ కార్టూన్ ఎగ్జిబిషన్‌ను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రారంభించనున్నట్టు హైదరాబాద్ ఫోరమ్ ఫర్ పొలిటికల్ కార్టూనిస్ట్స్ అసోసియేషన్ చైర్మన్ శంకర్, కార్యదర్శి మృత్యుంజయ్ ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరుకానున్నారని పేర్కొన్నారు.
రేపు ఆలయాల ఉద్యోగుల భేటీ
వేములవాడ, సెప్టెంబర్ 23: రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో ఉద్యోగుల సమస్యల పరిషారమే ఎజెండాగా ఆలయాల ఉద్యోగుల జేఏసీ పునర్నిర్మాణ దిశగా అడుగులు వేస్తున్నది. ఇటీవల దేవాదాయ శాఖలో ఉద్యోగుల బదిలీలు, జరిగిన పరిణామాల నేపథ్యంలో ఉద్యమ కాలంలోని జేఏసీ మళ్లీ ఇప్పుడు పునర్నిర్మాణానికి నాంది పలికింది. ఇందులో భాగంగా.. ఆలయ ఉద్యోగుల జేఏసీ సర్వసభ్య సమావేశం ఈ నెల 25న బుధవారం వేములవాడ పట్టణంలోని హోటల్ ఎస్ఆర్ఆర్ గ్రాండ్లో జరగనున్నది. రాష్ట్రంలోని వేములవాడ, యాదగిరిగుట్ట, భద్రాచలం, కొండగట్టు, బాసర, కొమురవెల్లి ఆలయాల అర్చక ఉద్యోగులు, జేఏసీ నాయకులు సుమారు 200 మంది వరకు హాజరుకానున్నారు. దీనికి టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్‌తోపాటు ఆలయాలు ఉన్న అన్ని జిల్లాల్లోని టీఎన్జీవో నాయకులు హాజరు కానున్నట్టు జేఏసీ వర్గాలు వెల్లడించాయి. దాదాపు 25 అంశాల ఎజెండాతో రాష్ట్ర దేవాలయాల ఉద్యోగుల జేఏసీ సర్వసభ్య సమావేశం జరగనున్నది. ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర దేవాలయాల జేఏసీ చైర్మన్ రమేశ్‌బాబు విజ్ఞప్తి చేశారు.